లంచం కేసులో లెఫ్టినెంట్ కల్నల్ అరెస్ట్... ఇంట్లోని సోదాల్లో భారీ నగదు!
భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నిరక్షరాస్యత తగ్గింది.. పేదరికం తగ్గుతుంది.. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.. అన్నీ తగ్గుతున్నాయి కానీ లంచం మాత్రం తగ్గడం లేదు అనే చర్చ ఇటీవల ఎక్కువగా జరుగుతుంది!;
భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నిరక్షరాస్యత తగ్గింది.. పేదరికం తగ్గుతుంది.. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.. అన్నీ తగ్గుతున్నాయి కానీ లంచం మాత్రం తగ్గడం లేదు అనే చర్చ ఇటీవల ఎక్కువగా జరుగుతుంది! లంచం లేని శాఖ భారతదేశంలో లేదు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో అనే స్థాయిలో పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. ఈ సమయంలో లంచం కేసులో ఓ లెఫ్టినెంట్ కల్నల్ ను అధికారులు అరెస్ట్ చేశారు.
అవును... రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ ఉత్పత్తి శాఖకు సంబంధించిన లంచం, అవినీతి కేసుకు సంబంధించి లెఫ్టినెంట్ కల్నల్ దీప కుమార్ శర్మను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. రక్షణ రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి ఏజెన్సీకి విశ్వసనీయ సమాచారం అందడం, ఈ నెల 19న సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఈ అరెస్టు జరిగింది.
ఈ క్రమంలో.. రక్షణ తయారీ, ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్న కొన్ని సంస్థలకు అనుచిత ప్రయోజనాలు కల్పించడానికి కుమార్ శర్మ లంచాలు డిమాండ్ చేసి, తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ నుంచి శర్మ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని సీబీఐ అధికారులు తెలిపారు. ఆ సంస్థ అధికారులతో శర్మ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో పక్క సమాచారంతో ఢిల్లీలోని శర్మ నివాసం సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో సీబీఐ రూ.2.23 కోట్ల నగదుతో పాటు రూ.3 లక్షల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో.. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లోని శర్మ భార్య కల్నల్ కాజల్ బాలి నివాసం నుంచి అదనంగా రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన సీబీఐ... శర్మ అవినీతి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం అలవాటుగా చేసుకున్నాడని.. ఇతర విస్తృత నేరపూరిత కుట్రంలో అతని భార్య, ఇతర సహచరులు భాగమని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కుట్రలో రక్షణ ఉత్పత్తులు, తయారీ, ఎగుమతులలో వ్యవహరించే అనేక ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు ఉన్నారని ఏజెన్సీ పేర్కొంది.