కవిత.. షర్మిల.. కనిమొళి.. రాజకీయంలోనూ ఆడబిడ్డ 'వాటా'

తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయమే నిదర్శనం.;

Update: 2025-05-23 16:30 GMT

తల్లిదండ్రుల ఆస్తిలో ఆడబిడ్డకు వాటా.. భారతీయుల సంప్రదాయంలో భాగం. ఎంత పేదవారయినా తమ ఇంటి ఆడ పిల్లకు ఎంతో కొంత ఇస్తుంటారు.. ప్రస్తుత కాలంలో ఇది ’రాజకీయం’లోనూ అన్నట్లుగా మారింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల్లో ఆడబిడ్డ వాటా గట్టిగా ప్రస్తావనకు వస్తోంది.

తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయమే నిదర్శనం. పార్టీలో సమ స్థాయిని ఆమె కోరుకుంటున్నారని, ఇంకా ముందుకెళ్లి ప్రత్యామ్నాయంపై కూడా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మద్యం కేసులో అరెస్టయిన కవిత గత ఏడాది ఈ సమయంలో ఢిల్లీ తిహాడ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తన రాజకీయ భవిష్యత్ ను దెబ్బకొట్టిన బీజేపీపై ఆమె మహా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రికి ఆరు పేజీల సుదర్ఘీ లేఖ రాయడం కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ లో తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంలో కూడా ఆమె ఉన్నట్లుగా చెబుతున్నారు. అసలు కవిత ఉద్దేశం ఏమిటో బయటపడాల్సి ఉంది. ఏదైనా సరే.. సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావుతో సమానంగా ఆమె బీఆర్ఎస్ లో స్థాయిని కోరుకుంటున్నట్లు, పార్టీ విధానాలతో ఏకీభవిస్తున్నట్లు లేరని అర్థం అవుతోంది.

మూడేళ్ల కిందట ఇదే సమయంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా రాజకీయంగా సొంత అడుగులు వేసిన సంగతి తెలిసిందే. అన్న వైస్ జగన్ అధికారంలొ ఉండగా.. అప్పట్లో ఆమె సొంత రాష్ట్రం ఏపీని వదలి తెలంగాణలో పార్టీ పెట్టడం కలకలం రేపింది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండడం, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇతర విషయాలు. రాజకీయ ప్రాధాన్యం విషయంలోనో, ఆర్థిక వివాదాలతోనో షర్మిల తన అన్న జగన్ ను విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఏపీకి తిరిగివెళ్లి అన్న ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు.

మహారాష్ట్రలో తిరుగులేని నాయకుడైన శరద్ పవార్.. ఎన్సీపీ పేరిట సొంత పార్టీని స్థాపించి తన సత్తాచాటారు. అలాంటి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం.. ఆమెకే పార్టీ పగ్గాలు దక్కుతుందనే వాదనలు వచ్చాయి. చివరకు ఎన్సీపీ వేరే కారణంతో చీలిపోయింది. పెద్ద పవార్ ఎంతో నమ్మకం ఉంచిన తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ పార్టీని నిలువునా చీల్చేశారు. సుప్రియా ఇప్పుడు ఎంపీగా మిగిలిపోయారు.

కొన్నేళ్ల కిందట తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి కుటుంబంలో వచ్చిన విభేదాల సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. కరుణానిధి కుమారులు అళగిరి, ప్రస్తుత సీఎం స్టాలిన్ లు పార్టీపై పట్టు కోసం ఎత్తుకుపైఎత్తులు వేశారు. వీరి సోదరి కనిమొళి 2జి స్పెక్ట్రం కేసులో జైలుకెళ్లారు. ఇప్పుడు ఆమె తూత్తుకూడి ఎంపీగా ఉన్నారు. అయితే, స్టాలిన్ కుమారుడు, తన మేనల్లుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం కావడం కనిమొళికి ఇష్టం లేదని చెబుతున్నారు. దీంతో ఆమె వచ్చే ఏడాది ఎన్నికల నాటికి ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News