ఏపీని ముంచిన 'మొంథా'.. నష్టం ఏ స్థాయిలో అంటే..!
ఈ సందర్భంగా సుమారు 25 జిల్లాల్లో ఈ తుపాను ప్రభావం చూపించిందని చెప్పిన జగన్... ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.;
‘మొంథా’ తుపాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఈ సమయంలో మొంథా రాష్ట్రాన్ని ఏస్థాయిలో ముంచిందో వివరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు!
అవును... మొంథా తుపాను ఏపీలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ పంటలకు, రహదారులకు నష్టం కలిగించిందని చెబుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రధానంగా వరి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని.. వీరితో పాటు పత్తి, వేరుశనగ, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుస్తోంది. ఈ సమయంలో సీఎం స్పందించారు.
రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం!:
ఏపీలో మొంథా కలిగించిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు వివరించారు! ఈ సందర్భంగా... మొంథా తుపాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో.. వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, ఆర్ అండ్ బీకి రూ.2,079 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. అయితే... తుపాను వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు.
ఈ సందర్భంగా.. ప్రతి కుటుంబాన్ని, ప్రతీ ఇంటినీ జియోట్యాగింగ్ చేయగలిగామని.. తుపాను వల్ల మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో విద్యుత్ సరఫరా ఆగితే 10 గంటల వరకు వచ్చేది కాదని.. అయితే, ప్రస్తుతం విద్యుత్ సరఫరా ఆగినా 3 గంటల్లోనే పునరుద్ధరణ జరిగిందని.. దానికి కారణం అంతా నిబద్ధతతో పని చేయడమేనని తెలిపారు.
ఇక గ్రామ, వార్డు సచివాలయాలను యాక్టివ్ చేశామని చెప్పిన చంద్రబాబు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అధికంగా వర్షాలు పడ్డాయని తెలిపారు. వర్షాల వల్ల వరదలు వచ్చాయని.. పులిచింతల వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరిందని వివరించారు. ఈ నేపథ్యంలో.. పంట నష్టంపై ఐదు రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ముందస్తు చర్యలతో తగ్గిన నష్టం!:
మరోవైపు, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా... 'మొంథా' తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో... తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఉచితం బియ్యం అందిస్తున్నామని.. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని.. ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు ఇస్తున్నామని చెప్పిన పవన్ కల్యాణ్... గ్రామాల్లో పాడైన రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేస్తామని తెలిపారు.
ఇదే క్రమంలో... మొంథా తుపానుతో కలిగే నష్టాన్ని ప్రధానంగా ముందస్తు చర్యలతో చాలా వరకు తగ్గించామని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపుతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని.. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మెసేజ్ లు పంపామని తెలిపారు.
మొంథాపై జగన్ లెక్క ఇది!:
మొంథా తుపాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 25 జిల్లాల్లో ఈ తుపాను ప్రభావం చూపించిందని చెప్పిన జగన్... ఉన్న సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇందులో ప్రధానంగా.. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఇదే క్రమంలో... 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా.. రైతులకు పార్టీ పరంగా తోడుగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు.
కేంద్రానికి పొన్నం ప్రభాకర్ కీలక రిక్వస్ట్!:
మొంథా తుపాను తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... తుపాను కారణంగా సిద్దిపేటలో నీట మునిగిన పంట పొలాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా... రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కేంద్రం దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి సాయం అందించాలని కోరారు.
ప్రధానంగా... హుస్నాబాద్ నియోజకవర్గం పూర్తిగా జలమయమైందని, వేల ఎకరాల్లో వరి పంట కొట్టుకుపోయిందని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్... ఆ ప్రాంతంలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. మరోవైపు... శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తానని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ తెలిపారు.
230 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రోడ్లు!:
ఈ తుపాను కారణంగా తెలంగాణలో 230 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ తుపాను కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కాజ్ వేల పునరుద్ధరణకు రూ.7 కోట్లు ఖర్చవుతుందని, శాశ్వత పునరుద్ధరణకు రూ.225 కోట్లు అవసరమని చెప్పారు.