శ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం.. రంగంలోకి భారత వాయుసేన

ఏపీ దిశగా దూసుకువస్తున్న దిత్వా తుఫాన్ శ్రీలంకలో అల్లకల్లోలం సృష్టించింది. సుమారు 123 మంది ప్రాణాలను బలితీసుకుంది.;

Update: 2025-11-29 18:04 GMT

ఏపీ దిశగా దూసుకువస్తున్న దిత్వా తుఫాన్ శ్రీలంకలో అల్లకల్లోలం సృష్టించింది. సుమారు 123 మంది ప్రాణాలను బలితీసుకుంది. తుఫాన్ బీభత్సంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రకటించారు. తుఫాన్ ధాటికి ఇప్పటివరకు సుమారు 123 మంది మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. మరో 130 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. 35 శాతం గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం

శ్రీలంకలో దిత్వా తుఫాన్ ధాటికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పలు ప్రావిన్సులను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి భారీగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల రవాణా వ్యవస్థ స్తంబించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల రైల్వేలైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. ఇక భారీ వర్షాల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను భారత్‌లోని కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాలకు మళ్లించినట్లు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

మరోవైపు శ్రీలంక అంతటా అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం విధించింది. ఈ మేరకు అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఎమర్జెన్సీని ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు అధ్యక్షుడు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు 43 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. కలయోయ ప్రావిన్సులోని ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న బస్సులో 68 మంది ప్రయాణికులను ఆర్మీ రక్షించింది. వరదల్లో బస్సు మునిగిపోవడంతో పైకప్పు ఎక్కిన ప్రయాణికులు దాదాపు 29 గంటల పాటు ప్రాణభయంతో అల్లాడిపోయారు.

భారీగా భారత్ సాయం

దిత్వా తుఫాన్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన శ్రీలంకను మన కేంద్ర ప్రభుత్వం ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ చేపట్టి బాధితులకు ఆహారం, ఇతర సహాయక సామగ్రిని అందజేసింది. భారత నేవీకి చెందిన సీ130 విమానంతో పాటు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయ్గిరి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సీ130 సైనిక రవాణా విమానంలో 21 టన్నుల సామగ్రిని కొలంబోకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా విపత్తు నిర్వహణ సిబ్బంది సుమారు 80 మందిని శ్రీలంక పంపింది.

Tags:    

Similar News