కావలి ఎమ్మెల్యేను బుక్ చేసిన సైబర్ నేరగాళ్లు
ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో సామాన్యుల్ని దోచేస్తున్న సైబర్ బందిపోట్లు.. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల్ని కూడా విడిచిపెట్టటం లేదు.;
ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో సామాన్యుల్ని దోచేస్తున్న సైబర్ బందిపోట్లు.. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల్ని కూడా విడిచిపెట్టటం లేదు. తాజాగా.. కావలిలో సైబర్ నేరస్తుల పంజాకు స్థానిక ఎమ్మెల్యే డీవీ క్రిష్ణారెడ్డి ప్రభావితమయ్యారు. ఆయనకు చెందిన ఖాతాలో నుంచి ఏకంగా రూ.23 లక్షలు దోచేశారు. సైబర్ నేరస్తుల ట్రాప్ లో ఆయనెలా బుక్ అయ్యారన్నది చూస్తే..
ఏపీ అధికార పక్షమైన టీడీపీ నేత.. కావలి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న క్రిష్ణారెడ్డికి ఇటీవలఆయన ఫోన్ లోని వాట్సాప్ కు ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. ఆర్టీఏ బకాయిలు చెల్లించే లింకుగా అందులో పేర్కొన్నారు. దీంతో.. తమ కంపెనీలకు చెందిన వాహనాలకు సంబంధించిన పెండింగ్ మొత్తాల్ని చెల్లిచాల్సి ఉంటుందన్న భావనతో.. ఆ ఏపీకే ఫైల్ మీద క్లిక్ చేశారు.
ఆ తర్వాత సిమ్ బ్లాక్ అయ్యింది. వెంటనే ఆయన హైదరాబాద్ లోని ఆధార్ విజిలెన్స్ విభాగం ముందు ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సదరు సిమ్ దాదాపు 25 రోజుల తర్వాత యాక్టివేట్ అయ్యింది. తీరా మొబైల్ ఓపెన్ చేసి చూస్తే.. రెండు వారాల వ్యవధిలో ఎమ్మెల్యేకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి దశల వారీగా రూ.23 లక్షల వరకు దోచేసిన విషయాన్ని గుర్తించారు.
దీంతో ఆయన సైబర్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో దూసుకెళుతున్న సైబర్ బందిపోట్లు.. వాట్సాప్ లో చూసినంతనే క్లిక్ చేయాలనన భావన కలిగే అంశాలతో ఏపీకే ఫైళ్లు పంపటం.. వాటిని క్లిక్ చేసినంతనే.. మన ఫోన్ యాక్సిస్ వారి చేతికి వచ్చేస్తుంది. దీంతో.. మన ఫోన్ లో ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. సో.. బీకేర్ ఫుల్.