కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాకోర్టులా ?
బీఆర్ఎస్ ను ఓడించేందుకు తెలంగాణా కాంగ్రెస్ సరికొత్త నినాదాన్ని కాయిన్ చేయబోతోంది. ఇంతకీ అదేమిటంటే ‘తిరగబడదాం-తరిమికొడదాం’ అని. కేసీయార్ పాలన మీద తిరగబడతాం..కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొడదాం అనే నినాదంతో కాంగ్రెస్ నేతలు రాజకీయం చేయబోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో సాధించిన ఘనమైన విజయంతో తెలంగాణా కాంగ్రెస్ రెచ్చిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ఎన్నికల్లో మంచి నినాదాలు జనాలను చాలా తొందరగా ఆకట్టుకుంటాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కేసీయార్ ప్రభుత్వాన్ని, పాలనను ఉద్దేశించి **తిరగబడదాం..తరిమికొడదాం** అనే స్లోగన్ మొదలుపెట్టింది.
అలాగే ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ పాలనపై ప్రజా కోర్టులను నిర్వహించాలని కూడా డిసైడ్ చేసింది. నిజానికి ప్రజాకోర్టులన్నది మావోయిస్టుల వ్యవహారం అని అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి మీద జనాల్లో బాగా వ్యతిరేకత వచ్చేసినపుడు మావోయిస్టులు సీన్లోకి ఎంటరవుతారు. అప్పుడు సదరు ప్రజాప్రతినిధిని దొరికించుకుని లేదా ఆ ప్రజా ప్రతినిధికి ప్రతినిధిగా ఎవరినో పట్టుకుని జనాల మధ్య నిలబెట్టి పంచాయితి చేస్తారు.
సదరు ప్రజాప్రతినిధి చేసిన తప్పులను ప్రజాకోర్టులో విచారిస్తారు. అప్పుడు ప్రజాకోర్టులో ప్రజా ప్రతినిధిగా శిక్షకూడా విధిస్తారు. కొన్నిసార్లు చంపేస్తారు కూడా. ఇదంతా ఒకపుడు జరిగిన వ్యవహారం. ఇప్పుడు తెలంగాణాలో మావోయిస్తులు ఎక్కడా ప్రజాకోర్టులు నిర్వహించటంలేదు. అలాంటిది ఇపుడు కాంగ్రెస్ పార్టీ సడెన్ గా ప్రజాకోర్టుల నినాదంతో కార్యక్రమాల జోరును పెంచబోతోంది.
అంటే మంత్రులు, బీఆర్ఎస్ ఎంఎల్ఏలు చేస్తున్న తప్పులు, పాల్పడుతున్న అవినీతిని జనాల్లో ఎండగట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ ప్రజాకోర్టుల కాన్సెప్టు ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. ఎందుకంటే ప్రజాకోర్టుల పేరుతో కాంగ్రెస్ నిర్వహించాలని అనుకుంటున్న కార్యక్రమాన్ని పోలీసులు అనుమతించే అవకాశాలు దాదాపు లేవనేచెప్పాలి. ఎందుకంటే ప్రజాకోర్టు అనగానే ముందుగా అందరికీ మావోయిస్టులే గుర్తుకొస్తారు కాబట్టి. అసలీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తే జనాలు వస్తారా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి తాను నిర్వహించబోతున్న కార్యక్రమానికి కొత్తగా మరేదైనా పేరుపెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచిస్తే మంచిది. గాంధీభవన్లో సోమవారం జరగబోతున్న స్క్రీనింగ్ కమిటి సమావేశం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.