ఓసీ నాయకులు రూ.50 వేలు.. బీసీ నేతలు రూ.25 వేలు!
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలు కలుగుతున్నాయి;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి దరఖాస్తులు తీసుకుంటామని టీపీసీసీ వెల్లడించింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇలా దరఖాస్తులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఆ దరఖాస్తులకు నిర్ణీత ఫీజు చెల్లించాలని చెప్పడం, ఆ ఫీజు కూడా భారీగానే నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలు కలుగుతున్నాయి. దీంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో అయిదారుగురు నాయకులు కూడా కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్నారు.
ఈ నేపథ్యంలో దరఖాస్తు ఫీజుగా ప్రాథమికంగా ఓసీలు అయితే రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ నాయకులు రూ.2500 చెల్లించాలని టీపీసీసీ నిర్ణయించిందని తెలిసింది.
కానీ ఇవే ఫైనల్ ఫీజులు కాదని సమాచారం. దామోదర్ రాజనర్సింహ నేతృత్వంలోని సబ్ కమిటీ ఈ రుసుము ఎంత అనేది నిర్ణయించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫీజును ఓసీ అభ్యర్థులకు రూ.50 వేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.25 వేలుగా నిర్ణయించాలని ఈ ఉప కమిటీ అనుకుంటోందని తెలిసింది.
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో స్థానం నుంచి కనీసం ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు కచ్చితంగా వస్తాయి. దీంతో కాంగ్రెస్‌కు కాసుల పంట పండడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.