సిద్ధరామయ్య నిష్క్రమణ లాభమా? నష్టమా? కాంగ్రెస్ వ్యూహమేంటి?
కర్ణాటక అంటేనే కులాల కుంపట్లు ఎక్కువగా చెబుతారు. అలాంటి చోట సిద్ధరామయ్య కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదనే అభిప్రాయం ఎక్కువగా ఉంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారమే సిద్ధూ రాజీనామా చేసినా, ఆ ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అహిందా ఓటర్ల మద్దతు ఉన్న బలమైన నేతగా సిద్దరామయ్యకు కర్ణాటకలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఏ ఇతర నాయకులకు లేనంత మాస్ ఇమేజ్ కూడా ఆయన సొంతం అంటున్నారు. అటువంటి నేతను తప్పించి డీకేకు కాంగ్రెస్ పట్టం కట్టడంపై విస్తృత చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ఇద్దరు నేతల్లో సిద్ధూ, డీకే ఇద్దరూ.. ఇద్దరే అంటారు. కానీ, సిద్ధూ ప్రభావమే ఎక్కువ అన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏ వ్యూహంతో సిద్ధూని తప్పించింది అన్నది హాట్ డిబేట్ గా మారింది. సిద్ధరామయ్య నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి తక్షణమే కొన్ని తీవ్రమైన నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్‌కు అహిందా గండం?
కర్ణాటక అంటేనే కులాల కుంపట్లు ఎక్కువగా చెబుతారు. అలాంటి చోట సిద్ధరామయ్య కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. కర్ణాటకలో మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితుల ఐక్య కూటమి అయిన 'అహిందా' వర్గానికి ఆయనే తిరుగులేని ఛాంపియన్ అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 'అహిందా' సామాజిక వర్గాల వాటా దాదాపు 60 శాతంపైనే ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఘనవిజయానికి సిద్ధు చేసిన సోషల్ ఇంజనీరింగే ప్రధాన పునాదిగా పనికి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు సిద్ధరామయ్యను పక్కన పెట్టడం ద్వారా ఆయా సామాజిక వర్గాల్లో ‘తమ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిని తొలగించారు’ అనే బలమైన అసంతృప్తి రేకెత్తే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నేత అహిందా వర్గాలను ఆకట్టుకునేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని అంటున్నారు.
సిద్ధూ మాస్ అప్పీల్ మిస్
కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, కేవలం తన సొంత ఇమేజ్‌తో ఓట్లు రాల్చగల 'మాస్ లీడర్లు' చాలా అరుదుగా ఉంటారు. సిద్ధరామయ్యకు రాష్ట్రవ్యాప్తంగా ఆ ఇమేజ్ ఉంది. ఆయన నోట వెంట వచ్చే డైలాగులు, సామాన్యుడిని ఆకట్టుకునే సంభాషణ శైలి పార్టీకి ఎప్పుడూ పెద్ద అసెట్ గా చెబుతుంటారు. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకేకి సిద్ధరామయ్య స్థాయిలో ఇమేజ్ లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే డీకే శివకుమార్ అద్భుతమైన ఆర్గనైజర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సిద్ధరామయ్య తరహాలో కర్ణాటక అంతటా సామాన్య ప్రజలను ఆకట్టుకునే జనాకర్షణ, మాస్ లీడర్ షిప్ డీకేఎస్ సొంతం చేసుకోవాల్సివుందని అంటున్నారు. ఆ దిశగా ఆయన వ్యవహార శైలి మారాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.
అంతర్గత విభేదాలకు చెక్ చెప్పాల్సిందే..
కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యంగా రెండు వర్గాలు ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఈ రెండు వర్గాలు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే తన వర్గాన్ని ఎప్పటికప్పుడు పెంచుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సిద్ధరామయ్య వర్గంగా చెబుతున్న మంత్రులు సతీష్ జార్కిహోళి, ఎంబీ పాటిల్, జి. పరమేశ్వర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి డీకేతో విభేదించేవారని అంటున్నారు. ఇకపై ఈ వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పూర్తి బాధ్యత డీకేపై ఉందని అంటున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేతలు డీకే నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు? ఆయన కింద పని చేయడానికి ఇష్టపడతారా? అనేది కూడా కన్నడ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఢిల్లీ వ్యూహం ఇదేనా?
ఇన్ని నష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపడానికి కొన్ని అత్యంత బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. రెండున్నర ఏళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పడినప్పుడే అధిష్ఠానం ఇరువురి మధ్య అధికార బదిలీ ఒప్పందం కుదిర్చిందని గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు డీకేకు సీఎం పీఠం ఇవ్వకపోతే, ఆయన తన అనుచర వర్గంతో తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని అంటున్నారు. ట్రబుల్ షూటరే రిబెల్ గా మారితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే స్థితికి దారితీస్తుందని. అందుకే హైకమాండ్ ముందే అప్రమత్తమైందని చెబుతున్నారు. అదే సమయంలో ఒక్కలిక సామాజిక వర్గం నేత అయిన డీకే ద్వారా ఆ వర్గం ఓట్లపై పూర్తి పట్టు సాధించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి ఉందని అంటున్నారు. పాత మైసూరు ప్రాంతంలో మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి దశాబ్దాలుగా బలమైన ఒక్కలిగ ఓటు బ్యాంకు ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడం ద్వారా, ఆ మొత్తం ఓటు బ్యాంక్‌ను జేడీఎస్, బీజేపీ కూటమి నుంచి పూర్తిగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని అధిష్ఠానం గట్టిగా నమ్ముతోందని అంటున్నారు.