కేరళ కాంగ్రెస్ భగభగ.. అసంతృప్తితో సీనియర్లు.. దెబ్బ పడుతోందా?

ఎన్నికల వేళ కేరళ కాంగ్రెస్ లో అసంతృప్తులు పార్టీ నేతలను టెన్షన్ కు గురిచేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిన సీనియర్లు టికెట్లను ఆశించారు.;

Update: 2026-03-22 17:30 GMT

ఎన్నికల వేళ కేరళ కాంగ్రెస్ లో అసంతృప్తులు పార్టీ నేతలను టెన్షన్ కు గురిచేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిన సీనియర్లు టికెట్లను ఆశించారు. అయితే పార్టీ కేరళ శాఖ మాజీ అధ్యక్షుడు సుధాకరన్ తో సహా పలువురు సీనియర్లను పార్టీ పక్కన పెట్టింది. సుధాకరన్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆయనతోపాటు మరికొందరు పార్టీపై కినుక వహించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలలో పార్టీ పరిస్థితిపై కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అంతృప్త నేతలు గుంభనంగా ఉన్నప్పటికీ వారి వైఖరి ఎలా ఉంటుందనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.

కేరళ అసెంబ్లీకి వచ్చేనెల 9న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) హాట్ ఫేవరెట్ గా ఎన్నికల కదన రంగంలో దిగింది. కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి ఆనవాయితాగా వస్తోంది. ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను మార్చుతూ ఆ రాష్ట్ర ప్రజలు తీర్పునిస్తున్నారు. కానీ, గత ఎన్నికల్లో ఈ పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టారు. ముఖ్యమంత్రి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు అధికారం అప్పగించారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో అధికారం పక్కా అన్న ధీమాతో కాంగ్రెస్ రంగంలోకి దిగినా, అసంతృప్తులు ఆ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి.

కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉండగా, కూటమిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండు విడతులుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 92 మంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ రెండో విడతలో 37 మందితో మరో జాబితా విడుదల చేసింది. అయితే నేమోం, కన్నూర్, పెరుబవూర్ వంటి నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించిన పేర్లు ఈ జాబితాలో లేకపోవడం తీవ్ర చర్చకు కారణమవుతోంది. ప్రధానంగా పార్టీ మాజీ చీఫ్ సుధాకరన్ తోపాటు సీనియర్ నేత ఎల్దోస్ కున్నాపిలిల్లిల్ వంటివారు టికెట్లు దక్కించుకోలేకపోయారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ లో విస్తృత చర్చ జరుగుతోంది.

పార్టీ కార్యకర్తలు తనను పోటీ చేయాలని కోరుకుంటున్నారని, కానీ అధిష్టానం పక్కన పెట్టిందని పెరుబపూర్ టికెట్ ఆశించిన కున్నాపిల్లిల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రణాళికలో భాగంగా తాను 9,000 ఓట్లను కొత్తగా చేర్పించానని, ఇప్పటికే 15 వేల ఇళ్లను సందర్శించానని కున్నాపిల్లిల్ చెబుతున్నారు. అయినా పార్టీ తనను పక్కన పెట్టిందనే ఆవేదన కున్నాపిల్లిల్ లో కనిపిస్తోందని అంటున్నారు. ఇలా కాంగ్రెస్ లో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాల వల్లే కొందరికి టికెట్లు దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నదే ఉత్కంఠకు గురిచేస్తోంది.

Tags:    

Similar News