బీసీ వర్సెస్ రెడ్డి.. లిఫ్టు రగడ: రేవంత్ రెడ్డి సీరియస్
సీఎం రేవంత్ రెడ్డి.. తన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సునిశితంగా మందలించారు. ఇకపై ఇలాంటి తప్పులు జరగొద్దని ఆదేశించారు.;
సీఎం రేవంత్ రెడ్డి.. తన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సునిశితంగా మందలించారు. ఇకపై ఇలాంటి తప్పులు జరగొద్దని ఆదేశించారు. తాను ఒకటి.. మంత్రులు ఒకటి కాదని.. తనకు ఎంత భద్రత ఉన్నా.. ప్రొటోకాల్ ఉన్నా.. మంత్రులను తృణీకరించడానికి వీల్లేదని.. ఈసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేకాదు.. ఈ వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మంత్రులకు కూడా ఆయన సర్ది చెప్పారు. మనలో మనం కొట్లాడుకుంటే.. సరికాదని సూచించారు. మీడియాకు, ప్రతిపక్షాలకు కూడా అలుసై పోతామన్నారు.
ఏం జరిగింది?
ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆయన నేరుగా రెండో ఫ్లర్‌లోని సమావేశ మందిరానికి వెళ్లి.. అక్కడ సీఎం సహా ఇతర మంత్రులతో భేటీకావాల్సి ఉంది. దీంతో తాను గుమ్మంలోకి రాగానే రెడీగా ఉన్న లిఫ్ట్‌ను ఎక్కే ప్రయత్నం చేశారు. అయితే.. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది.. పొన్నంను అడ్డుకున్నారు. సీఎం కోసం దీనిని కేటాయించామని.. సర్ వస్తున్నారని చెప్పారు. అయితే.. ఇంకా సీఎం రాలేదని.. తాను వెళ్తానని ఆయన పట్టుబట్టారు. కానీ, సిబ్బంది ఒప్పుకోలేదు.
దీంతో రెండో లిఫ్టు కిందికి వచ్చే వరకు రెండు నిమిషాలు వెయిట్ చేసి.. దానిని ఎక్కి పైకి వెళ్లారు. తాను లిఫ్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో సీఎం కోసం కేటాయించిన లిఫ్టులో నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పైకి వచ్చి.. తనతో సమానంగా లిఫ్టు నుంచి బయటకు వచ్చారు. ఆయన వెంట సీఎం కూడా లేరు. దీంతో షాకైన పొన్నం వెంటనే కిందికి వెళ్లి.. సిబ్బందిని నిలదీశారు. ``నేను ఎక్కుతానంటే.. సీఎం వస్తారని అడ్డుకున్నారు. మరి మరో మంత్రిని ఎలా అనుమతించారు`` అని నిలదీశారు.
రెడ్డి మంత్రి అయితే.. బీసీ మంత్రి అయితే ఒకటా? అని పొన్నం నోరు జారారు. అప్పటికే విపక్ష సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక, మీడియ అప్పటికే క్యాప్చర్ చేసింది. ఈ పరిణామాలు కొంత సేపటికి సీఎం చెవిలో పడడంతో ఆయన సిబ్బందిని మందలించారు. ఎవరున్నా.. అనుమతించాలని.. మంత్రులందరూ సమానమేనని.. కుల ప్రస్తావనకు చోటు లేదని హెచ్చరించి.. మంత్రులకు సర్దిచెప్పారు.