రేవంత్ టోన్ లోకి వస్తున్న కోమటిరెడ్డి

తొలి ఐదేళ్లలో కాళేశ్వరం పేరిట.. ఆ తర్వాత ధరణిపేరుతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందంటూ నిప్పులు చెరిగారు.;

Update: 2025-11-07 05:42 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వం మీదా పట్టును సాధిస్తున్నారా? ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ.. సహచరులే శత్రువులన్నట్లుగా సీన్ కనిపించింది. కాంగ్రెస్ లో తన కంటే సీనియర్లు చాలానే ఉన్నా.. అందరిని కాదని.. తననే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం రేవంత్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రే అయినప్పటికి.. సహచర మంత్రులకు ఇవ్వాల్సిన మర్యాదకు మించి ఇవ్వటం.. ఉప ముఖ్యమంత్రిని తనకు సమానంగా గౌరవం దక్కేలా బిహేవ్ చేయటం మొదట్లో అర్థం కాలేదు.

ఎక్కడ తగ్గాలన్న విషయాన్ని ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి తన తీరుతో చెప్పేశారు. నెమ్మదిగా సహచర మంత్రుల మీదా.. ప్రభుత్వం మీదా పట్టు బిగిస్తూ వస్తున్న ఆయన.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైనం తెలిసిందే. సమకాలీన రాజకీయాల్లో ఒక ఉప ఎన్నిక పోరు కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒకరు.. ఏకంగా ఆరు రోజుల పాటు ప్రచారానికి కేటాయించటం రేవంత్ కే చెల్లిందని చెప్పాలి. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం తమ ప్రచారంలో ప్రస్తావిస్తూ.. సీఎంను ఎద్దేవా చేయటం కనిపించింది.

అయితే.. ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్.. తన ప్రచారాన్ని అంతకంతకూ ముమ్మరం చేయటం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రి కేటీఆర్ లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగానే కాదు షాకింగ్ గా మారాయి. ‘నా కొడకా’ లాంటి పదాల్ని ఉపయోగించేందుకు అస్సలు తటపటాయించని రేవంత్ తీరు ఇప్పుడు చర్చగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబా? అన్న చర్చను బీఆర్ఎస్ తెరమీదకు తీసుకొచ్చింది.

మర్యాదల గురించి మీరే మాట్లాడాలి మరి.. అంటూ బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ వర్గీయులు పంచ్ లు ఇస్తున్నారు అదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ మాదిరి తాను సంస్కారం లేకుండా మాట్లాడనని.. తమ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన సూచనలకు తగ్గట్లు మాట్లాడతానని వ్యాఖ్యానించారు. మొత్తానికి సీఎం నోటి నుంచి వచ్చిన మాటలకు మరింతగా కేటీఆర్ చెలరేగిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైనా.. అందుకు భిన్నంగా మాట్లాడారు.

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యల ఫైర్ ను కంటిన్యూ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఆయన.. ‘అసెంబ్లీకే రాని కేసీఆర్.. రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తారు’ అని ప్రశ్నించటమే కాదు..తన మాటల గురిని కేటీఆర్ మీదకు మళ్లించారు. కేటీఆర్ సోదరి కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు.

తొలి ఐదేళ్లలో కాళేశ్వరం పేరిట.. ఆ తర్వాత ధరణిపేరుతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందంటూ నిప్పులు చెరిగారు. ‘దోచుకున్న సొమ్మును పంచుకునే విషయంలో కల్వకుంట్ల కుటుంబంలో వాటాల పంచాయితీ నడుస్తోంది. కేటీఆర్ సెంటిమెంట్ మాటల్ని నమ్మి మోసపోతే.. ఆ తర్వాత గోస పడతారు. ముఖ్యమంత్రి రేవంత్.. మంత్రులంతా కలిసి సమిష్టిగా జూబ్లీహిల్స్ లో డెవలప్ చేయాలని డిసైడ్ చేసినట్లుగా వివరించారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల్ని చేస్తే.. సీఎం రేవంత్ చేసిన ఫైరింగ్ వ్యాఖ్యల్ని తాను కూడా కంటిన్యూ చేసినట్లుగా కనిపిస్తోందని చెప్పాలి. మొత్తానికి తన బాటలోనే మంత్రులంతా నడిచేలా చేసుకోవటంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News