ఒకేసారి 22% ఉద్యోగులకు గుడ్‌బై! క్లిక్ అప్‌లో భారీ లేఆఫ్స్ ఎందుకు?

ప్రముఖ యూఎస్ సాఫ్ట్‌వేర్ సంస్థ 'క్లిక్ అప్' తమ కంపెనీలో ఏకంగా 22 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2026-05-22 16:39 GMT

ప్రముఖ యూఎస్ సాఫ్ట్‌వేర్ సంస్థ 'క్లిక్ అప్' తమ కంపెనీలో ఏకంగా 22 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచి, కంపెనీ ఉత్పాదకతను 100 రెట్లు ఎక్కువ చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు సంస్థ ప్రకటించింది. టెక్ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా బిజినెస్‌ను రీస్ట్రక్చర్ చేయడంలో భాగంగానే ఈ లేఆఫ్స్ జరిగినట్లు తెలుస్తోంది. అసలు ఇంత పెద్ద నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం..

సీఈఓ ఏమన్నారంటే?:

ఈ లేఆఫ్స్ గురించి క్లిక్ అప్ ఫౌండర్, సీఈఓ జెబ్ ఎవాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' లో స్పందించారు. "ఈ రోజు మేము 22 శాతం మంది ఉద్యోగులను తగ్గించాం. ప్రస్తుతం మా బిజినెస్ ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్‌గా ఉంది. కంపెనీని మరింత సమర్థవంతంగా నడపడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, దీనికి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను" అని ఆయన పేర్కొన్నారు. ఇక కంపెనీ ఈ నిర్ణయం వీక్అవ్వటం కాదు, భవిష్యత్తు అవసరాల కోసమే ఈ మార్పు చేశామని స్పష్టం చేశారు.

ఏఐ వాడితే కోటి రూపాయల జీతం:

ఉద్యోగులను తీసేసిన ఈ కంపెనీ, ప్రతిభ గల మిగిలిన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. లేఆఫ్స్ ద్వారా మిగిలిన డబ్బును ఏఐ సాయంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించే ఉద్యోగుల జీతాల కోసం కేటాయించనున్నారు. ఇక ఏఐ టూల్స్ వాడుతూ కంపెనీకి 100 రెట్లు ఎక్కువ లాభం చేకూర్చే ఉద్యోగులకు ఏడాదికి ఏకంగా 1 మిలియన్ డాలర్ల దాదాపు 8.3 కోట్ల రూపాయలకు పైగా శాలరీ ప్యాకేజీలు ఇస్తామని సీఈఓ అనౌన్స్ చేయడం విశేషం.

ఏఐ మేనేజర్లుగా మారాల్సిందే:

ఈ కొత్త ఆపరేటింగ్ మోడల్ ప్రకారం.. కంపెనీలోని బెస్ట్ ఇంజనీర్లు, ప్రొడక్ట్ లీడర్లు కేవలం కోడింగ్ రాయడానికే పరిమితం కాకుండా, ఏఐ ఏజెంట్లను నడిపించే మేనేజర్లుగా మారాల్సి ఉంటుంది. సాధారణంగా మనుషులు రాసే కోడ్‌ను రివ్యూ చేయడం కంటే, ఏఐ రాసే కోడ్‌ను చాలా వేగంగా రివ్యూ చేయవచ్చని కంపెనీ నమ్ముతోంది. "ఎవరైతే ఏఐ సాయంతో తమ పనిని ఆటోమేట్ చేసుకుంటారో, వారికి ఎప్పుడూ ఉద్యోగ ఢోకా ఉండదు. వారే ఏఐ సిస్టమ్స్‌కు ఓనర్లు అవుతారు" అని జెబ్ ఎవాన్స్ చెప్పుకొచ్చారు.

టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ సునామీ:

ఒక్క క్లిక్ అప్ మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా కూడా తమ ఏఐ ప్రాజెక్టులను బలోపేతం చేయడానికి 10 శాతం మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఇక అమెజాన్, ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలతో కలిపి ఈ ఏడాది టెక్ రంగంలో ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయి.ఇక ఈ ఏడాది ముగిసేసరికి ఈ సంఖ్య 3 లక్షలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

ఒకప్పుడు కేవలం ఖర్చులు తగ్గించుకోవడానికి లేఆఫ్స్ ప్రకటించే కంపెనీలు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తుండటం గమనార్హం. ఇక టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఉద్యోగులు కూడా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ తమను తాము అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్లిక్ అప్ ఉదంతం మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News