ఫ్రిజ్‌తో పని లేదు: 3000 ఏళ్ల నాటి ప్రాచీన కూలింగ్ టెక్నిక్
అధికంగా కరెంట్ బిల్లులతో ఇంటి యజమానులకు చెమటలు పట్టిస్తున్న ఏసీలు, ఫ్రిజ్ లు వంటి వాటికి ప్రత్యామ్నాయాలు లేవా? అంటే ఎందుకు లేవు.;
అధికంగా కరెంట్ బిల్లులతో ఇంటి యజమానులకు చెమటలు పట్టిస్తున్న ఏసీలు, ఫ్రిజ్ లు వంటి వాటికి ప్రత్యామ్నాయాలు లేవా? అంటే ఎందుకు లేవు. వేల ఏళ్ల నాటి టెక్నిక్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. అయితే ఆధునిక జీవనశైలి, పరుగు పర్యవసానం కొన్నిటిని ఆలోచించే దిశగా ఆకర్షించకపోవడం సమస్యగా మారింది.
భారతీయ జీవనశైలిలో మట్టి పాత్రలకు.. ముఖ్యంగా వేసవి కాలంలో `మట్కా` లేదా `రంజన్`(కుండలలో రకాలు)లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక కాలంలో ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చినా.. మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం వెనుక ఉన్న సంప్రదాయం.. విజ్ఞానం నేటికీ అజేయంగా కొనసాగుతోంది. ఈ విధానం కేవలం పాత కాలపు పద్ధతి మాత్రమే కాదు..దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే కుండల నాణ్యత - పరిశుభ్రతపై సరైన శ్రద్ధ వహించినప్పుడే ఈ నీటి వల్ల పూర్తిస్థాయి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
మట్టి పాత్రలో నీరు సహజంగా చల్లబడటం వెనుక `బాష్పీభవన ప్రక్రియ` అనే శాస్త్రీయ సూత్రం దాగి ఉంది. మట్టి కుండలు సూక్ష్మరంధ్రాలను కలిగి ఉంటాయి. వీటి ద్వారా నీరు నిరంతరం బయటకు చిమ్ముతూ ఉంటుంది. కుండ ఉపరితలంపై ఉన్న ఈ తేమ ఆవిరైపోయే క్రమంలో లోపల ఉన్న నీటిలోని ఉష్ణాన్ని గ్రహిస్తుంది. తద్వారా లోపలి నీరు క్రమంగా చల్లబడుతుంది. ఈ సహజసిద్ధమైన ప్రక్రియ వల్ల ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండానే నీరు చల్లగా మారుతుంది.
చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ కూలింగ్ టెక్నిక్ దాదాపు 3000 ఏళ్ల నాటిది. హరప్పా వంటి పురాతన నాగరికతలు కూడా వేడి వాతావరణంలో నీటిని చల్లబరచడానికి ఇలాంటి మట్టి పాత్రలనే ఉపయోగించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫ్రిజ్‌లో ఉంచిన నీరు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుని శరీరానికి ఒక్కసారిగా షాక్ ఇస్తే.. మట్టి కుండలోని నీరు నెమ్మదిగా, సహజంగా చల్లబడి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఆహ్లాదాన్ని అందిస్తుంది.
ఫ్రిజ్ నీరు తాగడం వల్ల గొంతు నొప్పి - జలుబు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ కుండలోని నీరు గొంతుపై సున్నితమైన ప్రభావాన్ని చూపుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారికి .. గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీర అంతర్గత వ్యవస్థలపై ఒత్తిడి లేకుండా హైడ్రేషన్‌ను అందించడంలో మట్కా నీరు కీలకంగా పనిచేస్తుంది.
ఆరోగ్యపరంగా చూస్తే.. మట్టికి సహజంగానే క్షార గుణం ఉంటుంది. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లతను సమతుల్యం చేయడంలో ఇది సహాయపడుతుంది. మట్టి కుండలోని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా... శరీరంలో పీహెచ్ స్థాయిలు సరిగ్గా ఉంటాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండటానికి..జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడానికి ఈ ప్రాచీన పద్ధతి ఒక గొప్ప సహజ పరిష్కారం.