చిరంజీవి కామెంట్లు సరే.. అసలు విషయం అర్థమైందా?!
చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్య లు.. ప్రభుత్వంలోని నాయకుల నుంచి చిరుపై జరిగిన వ్యాఖ్యల వాదన తర్వాత;
మెగాస్టార్ చిరంజీవి... తాజాగా వైసీపీ ప్రభుత్వం.. సీఎం జగన్ తీరును పరోక్షంగా ఎండగడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. హైద రాబాద్‌లో జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ.. సినీమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిశితంగా విమర్శించారు. అదేసమయంలో కీలకమైన ప్రత్యేక హోదా, పథకాలు, పేదల ఆకలి అంటూ.. పరోక్షంగా అన్నా క్యాంటీన్ల మూసి వేత వ్యవహారం.. ఉపాధి, ప్రాజెక్టులు, రోడ్లు.. ఇలా ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు.. ఎన్నో రోజులుగా చేస్తున్న విమర్శలను చిరంజీవి ఒకే వేదికపై ఒకటి రెండునిముషాల్లోనే వ్యాఖ్యానించారు.
సరే! ఇక్కడ ఒక కట్ చెబుదాం! చిరంజీవి ఎందుకు అలా వ్యాఖ్యానించారనేది పక్కన పెడితే.. చిరు విషయంలో ఇప్పటి వరకు ఎంతో సానుకూలంగా ఉన్న వైసీపీ నాయకులు.. మంత్రులు, మాజీ మంత్రులు కూడా.. ప్రభుత్వాన్ని ఒక్క మాట అనేసరికి విరుచుకుపడ్డారు. `మేం చిరుకు అబిమానులం` అంటూనే వారు ``గిల్లితే గిచ్చుతాం.. ఊరుకుంటామా.. ముందు మీ తమ్ముడి నోరు కడుగు``- అని చిరుకు కౌంటర్లు ఇచ్చారు. వీరిలో కీలకమైన ముగ్గరు కాపు నాయకులు, ఒక కమ్మ నాయకుడు కూడా ఉన్నారు. అంటే.. తమ ప్రభుత్వంపై చిరు చేసిన వ్యాఖ్యలకు కాపు నాయకుల నుంచి(చిరు సొంత సామాజికవర్గం) ఘాటు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేశారు.
ఇదీ.. సరే.. ఇక్కడ కూడా మరో కట్ చెప్పేద్దాం! ఇక, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్య లు.. ప్రభుత్వంలోని నాయకుల నుంచి చిరుపై జరిగిన వ్యాఖ్యల వాదన తర్వాత.. రాష్ట్రంలో ఇక, పొలిటికల్ ఫీవర్ వస్తుందని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా చిరుపై మంత్రులు, మాజీమంత్రులు చేసిన వ్యాఖ్యలకు కాపు సమాజం నుంచి బలమైన ఎదురుదాడి ఎదురవుతుందని విశ్లేషకులు అనుకున్నారు. మీడియా వర్గాల్లోనూ ఈ విషయంపై చర్చసాగింది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీలోని కాపు నేతల నుంచి కూడా కామెంట్లు కురుస్తాయని భావించారు.
కానీ, అనూహ్యంగా ఎవరూ పెదవి విప్పలేదు. ఎవరూ కూడా అటు చిరు చేసిన వ్యాఖ్యలను సమర్థించడం కానీ, ఇటు మంత్రు లు, నాయకులు చేసిన విమర్శలను తిప్పి కొట్టడం కానీ చేయలేదు. ప్రధానంగా జనసేన నుంచి ఎలాంటి ఉలుకు పలుకు కూడా వినిపించలేదు. కనిపించలేదు. అయితే, ఎప్పుడో మంగళవారం చాలా పొద్దుపోయిన తర్వాత.. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి , కాపు వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు మాత్రం చిరుకు మద్దతు పలుకుతూ.. ``సర్కారుకు హితవు పలికారు.. తప్పేంటి`` అని ప్రశ్నిస్తూ.. ట్వీట్ చేశారు. అంటే.. ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? కాపులు చిరు విషయంలో ఎలా స్పందిస్తున్నారని భావించాలి? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.