మళ్ళీ చిరంజీవి పేరు...ఆ కీలక పదవి కోసమేనా ?
ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ పేరుని గవర్నర్ పదవికి ముడి పెడుతూ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ చానళ్ళలో తెగ వైరల్ చేస్తున్నారు.;
అదేంటో రాజకీయాల్లో నేను లేను అని ఎంత చెబుతున్నా మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రం ఏపీ రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంటోంది. ఆయనను రాజ్యసభ మెంబర్ గా చేస్తారు. ఉన్నట్టుండి కేంద్ర మంత్రిని చేస్తారు. మరి కొందరు ఔత్సాహికులు అయితే ఏకంగా ఉప రాష్ట్రపతి పదవికి ఆయన పేరుని లింక్ పెడతారు ఇలా చిరంజీవిని ఏదో విధంగా రాజకీయాలతో లింక్ చేయాలన్న తాపత్రయం మీడియాదేనా లేక తెర వెనక కొందరు పెద్దల ఆలోచనలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ పేరుని గవర్నర్ పదవికి ముడి పెడుతూ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ చానళ్ళలో తెగ వైరల్ చేస్తున్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొందరలో అయిదారు రాష్ట్రాలలో కొత్తగా గవర్నర్లను నియమిస్తుంది అని అంటున్నారు. తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణా, పశ్చిమ బెంగాల్ లలో కొత్త గవర్నర్లు వస్తారని అంటున్నారు.
బీజేపీకి దక్షిణాది చాలా ఇంపార్టెంట్ గా ఇపుడు మారింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఏమి చేసినా సౌత్ స్టేట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇక ఈసారి గవర్నర్ల పోస్టులలో కూడా మిత్రులకు సముచితమైన ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడడానికి ఆక్సిజన్ మాదిరిగా పనిచేస్తున్న టీడీపీ జనసేనలకు న్యాయం చేయాలని చూస్తోంది అని చెబుతున్నారు.
అలా టీడీపీకి ఒకటి, జనసేనకు ఒకటి గవర్నర్ పదవులను ఇస్తారు అని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి ఈ పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు వినిపిస్తోంది. నూటికి తొంబై శాతం ఆయనకే అవకాశం ఇస్తారని అంటున్నారు. లేకపోతే యనమల రామక్రిష్ణుడు సహా మరి కొన్ని పేర్లు టీడీపీకి ఉన్నాయి.
ఇక జనసేనకు ఒక పోస్టు అంటే ఎవరు ఆ పార్టీ నుంచి అన్న చర్చ అయితే సాగుతోంది ఈ నేపధ్యంలోనే ఆసక్తికరంగా మెగాస్టార్ పేరుని తెర మీదకు తెస్తున్నారు అని అంటున్నారు. చిరంజీవిని రాజ్ భవన్ లోకి పంపించాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు ఉన్న మెగా ఇమేజ్ ని ఒక బలమైన సామాజిక వర్గం దన్నును ఈ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.
అయితే గవర్నర్ పదవి అంటే రాజ్యాంగబద్ధమైనది. రాజకీయాల నుంచి విరమించుకున్న వారు ఈ పదవిని చేపడతారు. లేదా కీలక పదవులు చేసిన వారికి ఈ పదవి ఇస్తారు. మెగాస్టార్ అయితే సినీ రంగంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఏడు పదుల వయసులో కూడా ఆయన కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ వస్తున్నారు పైగా ఆయన రాజకీయాలకు పదవులకు దూరం అని ఎపుడో చెప్పేశారు అని అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ కి గవర్నర్ పదవికి ముడి పెట్టి చేస్తున్న ప్రచారంలో ఎంత వరకూ వాస్తవం ఉంది అన్నది వేచి చూడాల్సిందే.