చైనాలో టాప్ డిఫెన్స్ శాస్త్రవేత్త అరెస్ట్.. అసలేం జరిగింది?
యూ ఫాక్సిన్ ఝీజియాంగ్ యూనివర్సిటీలోని ఏరోనాటిక్స్ & ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు.;
చైనాలో కీలక వ్యక్తులపై అవినీతి వ్యతిరేక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే దేశ రక్షణ రంగానికి అవసరమైన సెమీకండక్టర్లను తయారు చేసే ప్రముఖ శాస్త్రవేత్త .. ఝీజియాంగ్ మైక్రోవేవ్ టెక్నాలజీ కంపెనీ ఛైర్మన్ యూ ఫాక్సిన్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేశారు. సెప్టెంబర్ 21న హువాంగ్‌షి పర్యవేక్షక కమిషన్ ఆయనను అదుపులోకి తీసుకుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా ధృవీకరించింది.
యూ ఫాక్సిన్ ఝీజియాంగ్ యూనివర్సిటీలోని ఏరోనాటిక్స్ & ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. మైక్రోవేవ్ , మిల్లీమీటర్ వేవ్ రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీలో ఆయన నిపుణులు. కమ్యూనికేషన్, నావిగేషన్, రాడార్ టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. ముఖ్యంగా గాలియం నైట్రైడ్ , గాలియం ఆర్సెనైడ్ వంటి సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే మెటీరియల్ ప్రాసెసింగ్‌లో ఫాక్సిన్ కీలక పాత్ర పోషించారు.
ఫాక్సిన్ నేతృత్వంలోని ఝీజియాంగ్ మైక్రోవేవ్ టెక్నాలజీ కంపెనీ చైనా సైన్యానికి ఉపయోగపడే కమ్యూనికేషన్స్, ఉపగ్రహాల సర్క్యూట్లు, రాడార్లు వంటి కీలక ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ తయారుచేసే చిప్‌లను చైనా సైన్యం విస్తృతంగా వినియోగిస్తోంది.
ఈ అరెస్ట్ నేపథ్యంలో ఫాక్సిన్ తన బాధ్యతల నుంచి తాత్కాలికంగా విరమించుకున్నారు. ప్రస్తుతానికి, కంపెనీ రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు మరియు సీనియర్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తున్నారు.
2012లో చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవినీతిపై కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి సైనిక అధికారులు అరెస్టు అయ్యారు. యూ ఫాక్సిన్ అరెస్ట్ కూడా జిన్‌పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ప్రచారంలో భాగంగా జరిగిన మరో కీలక పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. దేశ రక్షణ రంగానికి సంబంధించిన ఉన్నత స్థాయి శాస్త్రవేత్త అరెస్టు కావడం చైనాలో చర్చనీయాంశంగా మారింది.