ఆపరేషన్ సింధూర్‌లో పాక్‌కు చైనా దన్ను.. అమెరికా నివేదికలో విస్తుపోయే నిజాలు
| ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక, సాంకేతిక సహకారం అందించిందని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ నివేదిక వెల్లడించింది. భారత్‌ను కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో సైనిక బలగాలు, మౌలిక సదుపాయాలను పెంచుతోందని పేర్కొంది. చైనా వ్యూహాలను ఎదుర్కొనేందుకు అమెరికాతో రక్షణ, నిఘా సహకారం పెంచుకోవాలని సూచించింది.
ఆసియా ఖండంలో భారత్ ఒక తిరుగులేని మహాశక్తిగా ఎదుగుతుండటాన్ని చైనా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోందా? ప్రపంచ వేదికపై మన దేశం సాధిస్తున్న అద్భుత విజయాలు.. పెరుగుతున్న ప్రతిష్ట డ్రాగన్ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతోంది తాజాగా అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ విడుదల చేసిన సంచలన నివేదిక.
మన దేశ భద్రత, సార్వభౌమత్వానికి సవాల్ విసిరిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పొరుగు దేశమైన పాకిస్థాన్ వెనుక ఉండి చైనా నడిపిన చీకటి వ్యూహాలను ఈ రిపోర్ట్ కళ్లకు కట్టినట్లు బయటపెట్టింది. భారత్‌ను నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక.. మన చుట్టూ విషవలయాన్ని అల్లుతూ మన ప్రగతికి అడ్డుకట్ట వేయాలన్నదే బీజింగ్ అసలు కుట్ర అని ఈ నివేదిక స్పష్టం చేసింది.
నేడు భారత్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తిగా.. సాంకేతికతలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న దేశంగా మారింది. అమెరికా వంటి అగ్రరాజ్యాలతో భారత్ పెంచుకుంటున్న బలమైన స్నేహబంధం చైనాకు మింగుడుపడటం లేదు. ఆసియాలో తన ఏకఛత్రాధిపత్యానికి భారత్ రూపంలో బలమైన పోటీ ఎదురవుతుండటంతో డ్రాగన్ ఆందోళన చెందుతోంది. అందుకే మన దేశాన్ని కట్టడి చేసేందుకు చైనా కుటిల మార్గాలను ఎంచుకుంది. సరిహద్దుల్లో సైనిక బలగాలను పెంచడం.. పారిశ్రామిక సరఫరా గొలుసులపై ఒత్తిడి తేవడం.. మన పొరుగు దేశాలను మనకు వ్యతిరేకంగా ఉసిగొల్పడం వంటి చర్యలకు పాల్పడుతోందని అమెరికా ప్యానెల్ కుండబద్దలు కొట్టింది.
దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఆపరేషన్ సిందూర్ ఉద్రిక్తతల సమయంలో చైనా ప్రదర్శించిన ద్వంద్వ వైఖరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ పోరాటంలో చైనా నేరుగా బరిలోకి దిగకపోయినా తెర వెనుక ఉండి పాకిస్థాన్‌కు భారీ ఎత్తున సైనిక, సాంకేతిక సహకారం అందించిందని అమెరికా నివేదిక తేల్చి చెప్పింది. పాకిస్థాన్ సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు చైనా తన వంతు సాయం చేసిందని పేర్కొంది. భారత్‌పై నిరంతరం ఒత్తిడి కొనసాగించేందుకు పాకిస్థాన్‌ను ఒక పావుగా వాడుకుంటూ దక్షిణాసియాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్నదే డ్రాగన్ దురాలోచన అని ఈ రిపోర్ట్ విశ్లేషించింది.
ఒకవైపు భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నట్లు నటిస్తూనే మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా తన సైనిక బలాన్ని చాపకింద నీరులా విస్తరిస్తోంది. సరిహద్దులకు అత్యంత సమీపంలో విమానాశ్రయాలు, రైల్వే లైన్లు.. భారీ రవాణా వ్యవస్థలను నిర్మిస్తోంది. ఏ క్షణంలోనైనా సైన్యాన్ని ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఈ మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకుంటోంది. కేవలం భూభాగంపైనే కాకుండా హిందూ మహాసముద్రంలోనూ తన నౌకాదళ ఉనికిని పెంచుకుంటూ గూఢచర్య కార్యకలాపాలతో భారత్‌ను నలువైపుల నుంచి చుట్టుముట్టే ప్రయత్నం చేస్తోందని నివేదిక హెచ్చరించింది.
చైనా రహస్య సాయానికి బలం చేకూర్చే మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహాయం అందించినట్లు చైనాకు చెందిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఇంజినీర్ స్వయంగా వెల్లడించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. శత్రుదేశానికి అండగా నిలిచిన డ్రాగన్ అసలు స్వరూపం ఈ ఒక్క సాక్ష్యంతో బట్టబయలైంది.
చైనా పన్నుతున్న ఈ వ్యూహాత్మక ఉచ్చును తిప్పికొట్టాలంటే భారత్ తన మిత్రదేశాలతో కలిసి మరింత బలంగా ముందుకు సాగాలని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ సూచించింది. ముఖ్యంగా అమెరికాతో నిఘా సమాచార మార్పిడి.. సముద్ర భద్రత.. రక్షణ రంగంలో ఉమ్మడి తయారీని పెంచుకోవడం అత్యవసరమని పిలుపునిచ్చింది.
ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భారత్ ప్రస్థానాన్ని ఆపడం ఎవరి తరం కాదు. శత్రువుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ.. మన సైనిక, ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేసుకుంటూ నవభారతం తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే ఉంటుంది.