షాకింగ్... మ్యూజిక్ సిస్టంలో బాంబు... ప్రేమించిన మహిళ భర్తకు గిఫ్ట్!

కాలేజీ రోజుల్లో ఓ వ్యక్తి, ఒక అమ్మాయిని ప్రేమించాడు.. అయితే, అది కాస్తా వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయింది.;

Update: 2025-08-17 14:30 GMT

కాలేజీ రోజుల్లో ఓ వ్యక్తి, ఒక అమ్మాయిని ప్రేమించాడు.. అయితే, అది కాస్తా వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోయింది. ఈ క్రమంలో సదరు యువతికి ఇటీవల వివాహం జరిగింది. ఈ సమయంలో తాను ప్రేమించినామె భర్తను ఎలాగైనా అంతమొందించాలని నిందితుడు కుట్రపన్నాడు. అందుకు అతడు ఎంచుకున్న దారి.. మ్యూజిక్ సిస్టంలో స్పీకర్‌ లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) అమర్చి, ఆ మహిళ భర్తకు బహుమతిగా పంపడమే.

అవును... ఛత్తీస్‌ గఢ్‌ కు చెందిన 20 ఏళ్ల ఎలక్ట్రీషియన్.. మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్‌ లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) అమర్చి, తాను ప్రేమించిన మహిళ భర్తకు బహుమతిగా పంపాడని పోలీసులు ఆదివారం తెలిపారు. నిందితుడు ఆన్‌ లైన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి ఐఈడీని అసెంబుల్ చేసి, ప్లగిన్ చేసినప్పుడు పేలిపోయేలా దానిని రూపొందించాడని తెలిపారు. అతని గూగుల్ హిస్టరీ ఈ విషయాన్ని బహిర్గతం చేసిందని అన్నారు.

దీంతొ... ఈ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ వర్మతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఖైరాఘర్ - చుయిఖాదన్ - గండాయ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) లక్ష్య శర్మ తెలిపారు. మిగిలినవారు... పరమేశ్వర్ వర్మ (25), గోపాల్ వర్మ (22), ఘాసిరామ్ వర్మ (46), దిలీప్ ధీమార్ (38), గోపాల్ ఖేల్వార్, ఖిలేష్ వర్మ (19)గా వెల్లడించారు.

మూడు, నాలుగు రోజుల క్రితం నకిలీ ఇండియా పోస్ట్ లోగోతో అందంగా గిఫ్ట్ ప్యాక్ చేయబడిన అనుమానాస్పద పార్శిల్ డెలివరీ చేయబడినప్పుడు ఈ కుట్ర వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఆ పార్శిల్ అఫ్సర్ ఖాన్ పేరు మీద వచ్చిందని.. ఆయనను లక్ష్యంగా చేసుకునే పంపించారని.. అయితే ఆ పార్శిల్ అనుమానాస్పదంగా ఉందని గుర్తించిన ఖాన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడని తెలిపారు.

ఈ సమయంలో రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ ప్యాకింగ్ ని పరిశీలించగా... కొత్త స్పీకర్ లోపల సుమారు 2 కిలోల ఐఈడీని దాచిపెట్టినట్లు కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. ఆ ఐఈడీకి కరెంట్ సప్లై అవ్వగానే పేలిపోయేలా అది రూపొందించబడిందని తేలిందని తెలిపారు. ఇందులో జెలటిన్ స్టిక్స్ ను ప్రాథమిక పేలుడు పదార్థంగా ఉపయోగించారని వెల్లడించారు.

వాస్తవానికి ఎలక్ట్రీషియన్ అయిన వర్మ.. స్పీకర్‌ ను కొనుగోలు చేసి ఆన్‌ లైన్ ట్యుటోరియల్‌ లను ఉపయోగించి ఐఈడీని అసెంబుల్ చేశాడని.. అతని మొబైల్ ఫోన్‌ లోని గూగుల్ హిస్టరీలో "పోలీసులకు దొరక్కుండా బాంబుతో ఒక వ్యక్తిని చంపడం ఎలా? " అనే విషయం సెర్చ్ చేసినట్లు ఉందని ఎస్పీ శర్మ తెలిపారు.

Tags:    

Similar News