ఇష్టం వచ్చినట్లుగా పోలీస్ స్టేషన్ కు వెళతామంటే ఎలా చెవిరెడ్డి?

అదేం సిత్రమో కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ రచ్చగా మారుతోంది. రాజకీయ వైరం పెరిగే కొద్దీ ఇలాంటి పరిస్థితులే తెర మీదకు వస్తుంటాయి.;

Update: 2025-06-15 05:44 GMT

అదేం సిత్రమో కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ రచ్చగా మారుతోంది. రాజకీయ వైరం పెరిగే కొద్దీ ఇలాంటి పరిస్థితులే తెర మీదకు వస్తుంటాయి. సంయమనం పాటించాల్సిన నేతలు సైతం తమకు తోచినట్లుగా జరగాలన్న పట్టును ప్రదర్శిస్తున్నారు. చట్టపరంగా అవకాశం ఉంటుందా? లేదా? అన్నది కూడా వారు పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్నది మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. అధికారంలో ఎవరు ఉన్నా.. పోలీసులు తాము చేయాల్సిన పనిని చేయాల్సి ఉంటుంది.

ఈ విషయంలో వారు చట్టానికి అతీతంగా వ్యవహరించే అవకాశం ఉండదు. అయినప్పటికి కొందరు అధికారులు తొందరపాటుతో తప్పులు చేస్తే.. అలాంటి వారికి మొట్టికాయలు వేయటానికి న్యాయ వ్యవస్థ ఉండనే ఉంది. ఈ విషయాన్ని విపక్ష నేతలు మర్చిపోకూడదు. నిజంగానే తమ వాదనలో పస ఉంటే.. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించటంలో తప్పు లేదు. దానికి బదులుగా రచ్చ చేయటం ద్వారా వచ్చే లాభం ఏమిటి? అన్న ప్రశ్నను వారు వేసుకోవాల్సిన అవసరం ఉంది.

తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఉదంతమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా ఒక ఉదంతంలో వైసీపీ కార్యకర్తల్ని పొదిలి పోలీసులు అరెస్టు చేశారు. జగన్ పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీనిపై స్పందించిన రాళ్లు రువ్విన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పరామర్శించేందుకు స్టేషన్ కు వచ్చిన వైసీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అనుమతించలేదు. దీంతో.. పోలీసులపై చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

ఒక కేసులో అరెస్టు అయిన వారిని పరామర్శించాలన్నదే వైసీపీ నేతల ఉద్దేశమైతే.. అందుకు తగిన అనుమతులు తీసుకొని వస్తే సరిపోతుంది. లేదంటే.. అధికారికంగా అనుమతుల్ని కోరినా సరిపోతుంది. ఒకవేళ చట్టబద్ధంగా రావాల్సిన అనుమతులు రాని పక్షంలో వాటిని ప్రశ్నించి.. అనుముతుల కోసం న్యాయపోరాటం చేయటం తప్పు కాదు. అయితే.. ఈ క్రమంలో చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది.

కానీ.. తాజా ఉదంతం కాస్త భిన్నంగా ఉంది. పార్టీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు స్టేషన్ కు వచ్చిన తనను సీఐ వెంకటేశ్వర్లు అనుమతించకపోవటంపై చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన ఆయన నిరసనను వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేస్తూ చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఒకవేళ చెవిరెడ్డి వాదనే నిజమని భావిస్తే.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సరిపోతుంది. కానీ.. అదేమీ చేయకుండా పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొనేలా వ్యవహరించటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News