మిస్ ఇంగ్లాండ్ స్థానంలోఆ దేశం నుంచి ఎవరు బరిలోకి?
ఇదంతా ఒక వైపు.. మరి టోర్నీ నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ స్థానంలో ఆ దేశం నుంచి ఇంకెవరైనా రీప్లేస్ చేస్తారా? అంటే అవుననే చెబుతున్నారు.;
అనుకున్నంత హైప్ లేదు కానీ.. ఎలాంటి పంచాయితీలు లేకుండా సజావుగా సాగుతుందని భావించిన మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ వైదొలిగిన తీరు తెలిసిందే. మిస్ వరల్డ్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు.. దానికి జరుగుతున్న రచ్చ తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి బయటకు వచ్చేసినట్లుగా మిస్ వరల్డ్ నిర్వాహకులు చెబుతుంటే.. అందుకు భిన్నంగా మిల్లా చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.
ఇదంతా ఒక వైపు.. మరి టోర్నీ నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ స్థానంలో ఆ దేశం నుంచి ఇంకెవరైనా రీప్లేస్ చేస్తారా? అంటే అవుననే చెబుతున్నారు. మిల్లా మాగీ స్థానాన్ని భర్తీ చేసేందుకు మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ గా నిలిచిన చార్లెట్ గ్రాంట్ హైదరాబాద్ కు వచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒకట్రెండు మీడియా సంస్థలతో మాట్లాడారు. పోటీల్లో పాల్గొనాలంటూ వచ్చిన ఫోన్ కాల్ సమయంలో తాను చేపలు పడుతున్నట్లుగా చెప్పారు. తనకు చేపలు పట్టటం ఒక వ్యాపకమని.. చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రజల అప్యాయత తనకు ఎంతో నచ్చిందని.. వారు తనకు వెల్ కం చెప్పిన తీరు చాలా బాగుందన్నారు. తాను చూడని ప్రదేశాల్ని రానున్న రోజుల్లో చూసేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన చార్లెట్.. ‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలు.. సంబరాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాకు లభించిన ఈ అవకాశం అరుదైనది.. ప్రతిష్ఠాత్మకమైనది’ అని పేర్కొన్నారు.
తెలంగాణ అతిధ్యాన్ని తాను మర్చిపోలేనని.. తనకెంతో నచ్చినట్లుగా చెప్పారు. ఫ్యాషన్ షోలో భాగంగా తెలంగాణ సంప్రదాయ వస్త్రాలతో పాల్గొనటం చాలా కొత్తగా అనిపించినట్లు చెప్పిన ఆమె.. క్యాన్సర్ తో బాద పడుతున్న వారి సహాయార్థం బ్యూటీ విత్ ఎ పర్పస్ లో భాగంగా తాను పెద్ద ఎత్తున విరాళాలు సేకరించినట్లుగా వెల్లడించారు. ఇప్పటికే పలు పోటీలు పూర్తి అయ్యాయని.. రానున్న పోటీల్లో నూటికి నూరు శాతం ప్రయత్నిస్తానని చెప్పిన ఆమె.. జీవితాంతం ఈ అనుభూతుల్ని గుర్తుండిపోయేలా చేసుకుంటానని వ్యాఖ్యానించారు.