ఢిల్లీకి చంద్రబాబు.. ఈసారి గట్టి పట్టు!
టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయన చేస్తున్న ఢిల్లీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది;
టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు. కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయన చేస్తున్న ఢిల్లీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన ఇప్పుడు పెట్టుకున్న పర్యటన వెనుక గట్టి రీజనే ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనూ కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు గట్టి వ్యూహం. ఇప్పటికే జనసేనతో కలిసి ఆయన దూకు డుగా ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల పంపకాలు కూడా.. దాదాపు కొలిక్కి వచ్చాయి. ఇలాంటి సమయంలో ఇక మిగిలింది.. బీజేపీనే. ఆ పార్టీతోనూ పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని టీడీపీ-జనసేన కోరుకుంటోంది.
అయితే.. ఇప్పటి వరకు బీజేపీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఇదిలావుంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్.. అనూహ్యంగా రాత్రికి రాత్రి ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అజెండా వచ్చే ఎన్నికల్లో బీజేపీని కలపుకొని వెళ్లాలనేదే. ఏదో ఒకటి తేల్చాలని.. దీనిపై ఎక్కువగా సాగదీత వద్దని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినట్టు అప్పట్లోనూ వార్తలు వచ్చాయి. దీనికి అనుకూలంగానే బీజేపీ కొన్ని సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇక, పవన్ అలా వెళ్లి కలిసి వచ్చిన తర్వాత.. నాలుగు రోజుల్లోనే చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ పెద్దలతో ఈ దఫా నేరుగా చంద్రబాబు భేటీ అవుతారని.. కలిసి వచ్చే అంశాన్ని తేల్చుకుంటారని, ఎన్నికలకు సమయం చేరువ అవుతుండడం, మరో రెండు మూడు వారాల్లోనే ఎన్నికల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై ఒక క్లారిటీకి వచ్చేస్తారని.. పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటకీ.. కొన్ని సీట్లపై చంద్రబాబు-పవన్ ఏకాభిప్రాయానికి రాలేకపోయారని అంటున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తే.. నాలుగు నుంచి 6 సీట్లు అసెంబ్లీ.. రెండు సీట్లు పార్లమెంటుకు ఇచ్చేందుకు చంద్రబాబు యోచిస్తున్నారని.. ఎప్పటి నుంచొ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో చంద్రబాబు తాజా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. చంద్రబాబు నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అదేవిధంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతోనూ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నడ్డాతో పార్టీ వ్యవహారాలు.. షాతో రాష్ట్రంలో శాంతి భద్రతలు.. ఇటీవలకాలంలో జరిగిన పరిణామాలను ఆయన వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మరింత బలగాలను పంపాలని.. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికేరెండు లేఖలు పంపించారు. ఈ విషయాన్ని కూడా షాతో చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉందని అంటున్నారు.