బాబు నోట సంక్షేమం...జగన్ మాట అభివృద్ధి ..!

Update: 2024-05-09 13:27 GMT

2024 ఎన్నికల ప్రచారం మొదట్లో వైసీపీ అధినేత జగన్ సంక్షేమ మంత్రాన్ని పఠిస్తూ సాగారు. సిద్ధం పేరిట రీజనల్ సభలతో పాటు మేమంతా సిద్ధం పేరుతో ఏపీ అంతటా సాగిన బస్సు యాత్రలో సైతం జగన్ సంక్షేమ పధకాలనే ఎక్కువగా చెబుతూ వచ్చారు. ప్రతీ ఇంటికీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా నగదుని నేరుగా వారి ఖాతాలలో జమ చేశామని కూడా జగన్ పేర్కొంటూ వచ్చారు.

ప్రతీ ఇంటికీ తమ ప్రభుత్వం అందించే పధకం అందిందని, మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటు వేయండి అని ఆయన ప్రచారంలో వెల్లడించారు. ఇదిలా ఉండగా మరో వైపు చూస్తే టీడీపీ అధినేత అభివృద్ధి చేస్తామని ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళ్తామని చెబుతూ వచ్చారు. ఆయన ప్రతీ సభలో ఎక్కువగా ఏపీ అభివృద్ధి మీదనే చర్చ సాగేది.

ఈ విధంగా ఏపీలో జగన్ కానీ చంద్రబాబు కానీ పోటీ పోటీగా నిర్వహించిన సభలలో ఇద్దరూ కూడా తాము ఎక్కువగా ఇష్టపడే ఫీల్డ్స్ నే టచ్ చేస్తూ జనంలోకి వెళ్లారు. అయితే గడచిన కొన్నాళ్ళుగా చూస్తే సీన్ మారింది. జగన్ నోట అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. బాబు మాటలలో సంక్షేమం కనిపిస్తోంది.

ఈ ఇద్దరూ బాగా చేంజ్ అయినట్లుగా వారి ప్రసంగాలు చూస్తే అర్ధం అవుతున్నాయి. మరి వారికి అందిన ఫీడ్ బ్యాక్ నుంచి అలా తీసుకుని మారారా లేక జనాలలో చెప్పాల్సింది వారి బుర్రలోకి వెళ్లాల్సింది ఈ పాయింట్లే అనుకుని ప్రసంగాలలో ఈ సబ్జెక్టులను తీసుకుని వచ్చారా అంటే తెలియదు కానీ ఇద్దరూ మాత్రం తమ స్టైల్ ఆఫ్ స్పీచెస్ ని ఒక్కసారిగా మార్చేశారు.

Read more!

అది కూడా ఎన్నికల మ్యానిఫేస్ట్లోనూ కనిపించింది. జగన్ అయితే తాను ఇస్తున్న సంక్షేమ పధకాలకు కాసింత మెరుగులు దిద్ది తాను ఇంతే ఇవ్వగలను అని అక్కడితో ఆపేశారు. అంటే సంక్షేమానికి ఆయన ఫుల్ స్టాప్ అక్కడితో పెట్టేశారు అన్న మాట. అయితే ఆ తరువాత రిలీజ్ అయిన టీడీపీ మ్యానిఫేస్టోలో చూస్తే మాత్రం చంద్రబాబు జగన్ సంక్షేమానికి రెట్టింపు ఇస్తామని చెప్పడమే కాదు దానినే ప్రధాన ఆయుధంగా చేసుకుని తన ప్రసంగాలలో హోరెత్తిస్తున్నారు.

అంతే కాదు తమ ప్రభుత్వం వస్తే ప్రతీ ఇంటికీ డోర్ డెలివరీ మెకానిజం తో సంక్షేమ పధకాలను అందిస్తామని బాబు చెప్పడం కూడా జరుగుతోంది. ఇక జగన్ విషయమే తీసుకుంటే ఆయన ఇప్పటిదాకా వల్లిస్తూ వస్తున్న సంక్షేమ పధకాల డోస్ ని ప్రసంగాలలో తగ్గించి అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.

ఏపీలో తమ హయాంలో చేసిన అభివృద్ధి ఇదీ అని చెబుతున్నారు. తాము అభివృద్ధి విత్తనాలు నాటామని వాటి ఫలితాలు రావాలీ అంటే మరోసారి వైసీపీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జగన్ తన ప్రసంగాలలో పదే పదే చెబుతున్నారు. పేదల ఇళ్ళలో అభివృద్ధి తమ హయాంలో సాగిందని అలాగే వెనక బడిన ప్రాంతాలకు తమ హయాంలో చేసిన అభివృద్ధి ఒక గీటు రాయి అని జగన్ అంటున్నారు.

4

ఏపీకి గ్రోత్ ఇంజన్ గా విశాఖను చేసుకుని రానున్న పదేళ్ళలో హైదరాబాద్ కి ధీటుగా విశాఖను తీర్చిదిద్దుతామని జగన్ అంటున్నారు. ఏపీకి అన్ని విధాలుగా ఆర్ధిక వనరుగా విశాఖ నిలుస్తుందని ఆయన చెబుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే తాను కచ్చితంగా విశాఖనే రాజధానిగా చేసుకుని పాలిస్తానని తద్వారా ఏపీ రూపురేఖలు మొత్తం మారిపోయేలా చూస్తామని జగన్ చెబుతూ వస్తున్నారు.

ఇలా ఇద్దరు నేతలూ తన అజెండాలలో కీలకమైన మార్పులు చేసుకుని జనాల వద్దకు వస్తున్నారు. జగన్ కి సంక్షేమ నేత అన్న ముద్ర ఉంది.బాబుకు అభివృద్ధి శీలి అన్న బ్రాండ్ ఉంది. ఈ ఇద్దరికీ ఉన్న ఈ ముద్రలతో పూర్తి స్థాయిలో జనాల మదిని గెలుచుకోలేమని భావించే ఈ విధంగా రెండవ వైపు ఎంచుకుని మరీ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇపుడు జగన్ అభివృద్ధికి అట్రాక్ట్ అయ్యే కొత్త సెక్షన్లు ఏవీ అలాగే చంద్రబాబు సంక్షేమ హామీలను నమ్మి వెంట నడిచే వర్గాలు ఏవి అన్న దాని మీదనే రేపటి ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News