ఏపీలో జీరో సూసైడ్స్ లక్ష్యం...దేశంలోనే ఫస్ట్ టైం
అంతటి మనో దౌర్బల్యంతో జనాలు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువత సంగతి చూస్తే ఏ చిన్న విషయం అయినా తట్టుకునే పరిస్థితి అయితే అసలు లేదని చెప్పాల్సి ఉంది;
మాట్లాడితే చాలు ఆత్మ హత్యలు పెరిగిపోతున్నాయి. అంతటి మనో దౌర్బల్యంతో జనాలు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువత సంగతి చూస్తే ఏ చిన్న విషయం అయినా తట్టుకునే పరిస్థితి అయితే అసలు లేదని చెప్పాల్సి ఉంది. వారు అర్ధం పర్ధం లేని విషయాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ముక్కుపచ్చలారని వారు జీవితం అందాన్ని ఏ మాత్రం ఆస్వాదించని వారు ఆత్మహత్యలు చేసుకుంటూంటే అయ్యో అని చింతించడమే సమాజం వంతు అవుతోంది. అయితే దీనిని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది.
ఆత్మహత్యలు లేని ఏపీగా :
ఏపీలో ఆత్మహత్యలు అన్న మాట వినబడకుండా ఏమేమి చేయాలి అన్నది కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. పాఠశాల విద్య ఉన్నత విద్య మానవ వనరులకు నైపుణ్యం ఉపాధి కల్పనపై ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మానవ వనరులు ఒక సంపదగా చెప్పారు. వాటిని కాపాడుకోవాలని అలాగే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు అలాగే ఉన్నతాధికారులకు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
అవగాహనతోనే :
ఏపీలో ఆత్మహత్యలు లేకుండా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేస్తున్నారో వారికి తగిన విధంగా అవగాహన కల్పించాలని బాబు కోరారు. ఏపీలో జీరో సూసైడ్స్ లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అంతే కాదు ఈ విషయంలో రైతులు, విద్యార్ధులు, కుటుంబాలకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వండని బాబు కోరారు. దాని ఫలితంగా ఏపీలో ఆత్మహత్యలు తగ్గడమే కాకుండా పూర్తిగా లేకుండా పోయే రోజుని తీసుకుని రాగలమని బాబు అన్నారు. నిజంగా ఇది ప్రతీ రాష్ట్రం దేశం కూడా టచ్ చేయాల్సిన అంశం. ఈ విషయంలో చంద్రబాబు వినూత్నమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఆయన ఈ విషయం మీద ఫోకస్ పెట్టడంతో రానున్న రోజులలో మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. అలాగే మాతా శిశు మరణాల రేటును జీరోకి తీసుకురావాలని అన్నారు.
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ :
ఏపీలో వచ్చే ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తాం తీసుకువస్తామని బాబు చెప్పడం మరో విషయంగా చూడాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి సాధికారిత కల్పించేలా సమీకృత అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని బాబు కోరారు. అలాగే జనాభా నిర్వహణ అనేది కూడా మరో అజెండాగా కొనసాగాలని ఆయన చెప్పారు. ఇక మీదట అంతా ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు ఉంటాయని అన్నారు. అలాగే ఈ ఫ్యామిలీ కార్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందేవారి వివరాలను నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
వర్క్ ఫోర్సు పెరగాలి :
ఎక్కడైన పనిచేసే వారు ఉంటేనే అభివృద్ధి సంపద అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ విధంగా ఏపీలో వర్క్ ఫోర్స్ పెద్ద ఎత్తున పెంచాల్సి ఉందని ఆయన అన్నారు. దాని కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఉండాలని చెప్పారు. ఫ్యూచర్ అంతా చూస్తే కనుక నైపుణ్యాభివృద్ధిదే కీలక భూమిక అని బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సుల లాగానే స్కిల్ డెవలప్మెంట్ లోనూ డిగ్రీలు కూడా పొందే అవకాశం ఉంటుందని బాబు వివరించారు. అలాగే రానున్న కాలంలో కొత్త రంగాలలో సైతం విస్తృతంగా ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. అలా పరిశ్రమలు, టూరిజం, ఐటీ సహా కీలక రంగాలలో ఉపాధి హెచ్చుగా లభిస్తుందని అన్నారు. ఏపీలో చూస్తే ఇప్పటి వరకూ 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలిగామని ముఖ్యమంత్రి చెబుతూ అలా ఉద్యోగాలు అందుకున్న వారి పూర్తి వివరాలు అన్నీ డ్యాష్ బోర్డులో పేర్లతో సహా ఉంచాలని అధికారులను ఆదేశించారు.