ఆ ఏడుగురితో తలవంపులు.. మంత్రివర్గ సమావేశంలో సీఎం సీరియస్, లోకేశ్ ఫైర్

ప్రభుత్వం ఏర్పడి 14 నెలల వ్యవధిలో అనేక మందిపై ఆరోపణలు వస్తున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇటీవల ఏడుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన విమర్శలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వ్యాఖ్యానించారు;

Update: 2025-08-21 15:40 GMT

టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలల వ్యవధిలో అనేక మందిపై ఆరోపణలు వస్తున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇటీవల ఏడుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన విమర్శలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో అధికారిక అంశాలు ముగిసిన తర్వాత రాజకీయాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న విమర్శలపై మంత్రివర్గంలో సీరియస్ గా చర్చించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం, నెల్లూరుకు చెందిన జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించడంపై టీడీపీ ఎమ్మెల్యే పాత్రపై మంత్రి లోకేశ్ సీరియస్ అయినట్లు చెబుతున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో గెలవడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ద్రుష్టిని ఆకర్షించామని ఇంతలోనే ఎమ్మెల్యేల వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చి ఆ విజయం వెనక్కి వెళ్లిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలే అడ్డుగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని సీఎం ప్రశ్నించారని చెబుతున్నారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులతో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా ఒకటి తయారైందని, అందరూ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారని చెబుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ చార్జి మంత్రులు ఒక కంట కనిపెట్టాలని, పరిధి దాటుతున్నట్లు అనిపిస్తే వెంటనే పిలిపించి మాట్లాడాలని సీఎం సూచించారని చెబుతున్నారు.

కాగా, ఉదయం కేబినెట్ సమావేశానికి ముందు సీఎం నివాసంలో మంత్రి లోకేశ్ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలోనూ ఎమ్మెల్యేల పనితీరుపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలన్న విషయమై మంత్రి లోకేశ్ కొన్ని సూచనలు చేశారని సమాచారం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా మాట్లాడారని అంటున్నారు. ఇలా రోడ్డు మీద ఉద్యోగులపై దాడి చేయడం ఏంటని మంత్రి లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, పులివెందుల వంటి చోట్ల ఘన విజయాలు సాధిస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడం సరికాదని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

ఇక తాజా రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ఈ నెల 23న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారని టీడీపీ వర్గాల సమాచారం. సమస్యలపై తమ వద్దకు వచ్చేవారితో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా వ్యవహరించాలని, లేనిపోని వివాదాల్లో ఇరుక్కోవద్దని ఈ విషయంలో జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని అంటున్నారు. ఇక కొందరిని పిలిపించి మాట్లాడతానని చెప్పిన సీఎం.. ఎమ్మెల్యేల్లో గుబులు రేపారు. సీఎం ఎవరెవరిని పిలుస్తారు? ఏం అడుగుతారనేది టీడీపీలో చర్చకు దారితీస్తోంది.

Tags:    

Similar News