పిలిచి ఉద్యోగం ఇస్తాను అంటే నో చెప్పా... బాబు ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా జీవితం తెరచిన పుస్తకమే. ఆయన గురించి ఎరగని వారు ఎవరూ ఉండరు.;

Update: 2025-11-26 08:02 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా జీవితం తెరచిన పుస్తకమే. ఆయన గురించి ఎరగని వారు ఎవరూ ఉండరు. ఆయన దాదాపుగా నాలుగు తరాలతో పనిచేశారు. నాటి నుంచి నేటి రాజకీయాన్ని చూస్తూ ఈ తరానికి చేరువ అయ్యారు. ఎర్లీ సెవెంటీస్ నుంచే బాబు రాజకీయం స్టార్ట్ అయింది. ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూ రాజకీయంగా ఓనమాలు దిద్దారు. అనంతరం ఆయన యువకుడుగా ఉంటూనే ఎన్నికల్లో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే ఆ మీదట మంత్రి అయిపోయారు. మంచి వయసులో ఉండగానే సీఎం కూడా అయ్యారు ఇలా బాబు పొలిటికల్ లైఫ్ చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. అదే ఆయన మాటలలో వింటే ఇంకా ఉత్కంఠగా ఉంటుంది.

ఎమ్మెల్యే అవుదామనే :

అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్ధులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. అలాగే అనేక విషయాలు వారితో పంచుకున్నారు. 28 ఏళ్లకే నేను ఎమ్మెల్యే అయ్యాను అని గతాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను యూనివర్సిటీ లో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని గట్టిగా కోరుకున్నానని ఆయన చెప్పారు. ఆ రోజులలో తమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ గా చేరాలని అడిగితే తాను .లెక్చరర్‌గా రాను ఎమ్మెల్యే అవుతానని ఆయనకే స్పష్టంగా చెప్పాను అని చంద్రబాబు ఎవరికీ తెలియని విషయాన్ని పంచుకున్నారు.

గెలిచి చూపించా :

కేవలం తనలో కోరికను అలా ఉంచుకోలేదని దాని కోసం శ్రమించను అన్నారు. చదువు అయిన వెంటనే 1978 లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కనబడతానని వీసీకే చెప్పి అలాగే గెలిచి చూపించాను అని బాబు చెప్పారు. ఇక ఐఏఎస్ అవ్వాలంటే ఎంతో ప్రిపేర్ అవ్వాలి అదే రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయవచ్చని కూడా తాను ఆనాడే ఆలోచించాను అని బాబు చెప్పారు. ఎవరైనా నిరంతరం శ్రమ చేయాలి అదే సమయంలో ప్రతి ఒక్కరికీ సంక్షోభాలతో పాటు సమస్యలు కూడా వస్తాయని అయినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని బాబు విద్యార్థులకు సూచించారు. అలా ప్రతీ విద్యార్థి. సరైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలని వారికి దిశా నిర్దేశం చేశారు.

పట్టుదలతోనే అంతా :

తన రాజకీయ జీవితం అంతా పట్టుదలతోనే సాధించుకున్నదని బాబు వివరించారు. తాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయ్యానని, అలాగే . 30 ఏళ్లకే మంత్రి అయ్యానని, 45 ఏళ్లకు సీఎం అయ్యానని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరు చాలా అభినందనీయం అన్నారు. ఏకంగా ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి ఆయా నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది అని అన్నరు.

ఎమ్మెల్యేల కంటే సూపర్ :

ఇక స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారు చాలా బాగా రాణించారు అని బాబు కితాబు ఇచ్చారు. విద్యార్థులు తక్కువ సమయంలోనే అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్ గా వ్యవహరించారని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. ఎమ్మెల్యేలు తడబడ్డా విద్యార్ధులుమాత్రం తడబడలేదని అలా చూపించిన విద్యార్ధుల కాన్ఫిడెన్స్‌కు అభినందనలు అని బాబు చెప్పుకొచ్చారు. అదే విధంగా అసెంబ్లీని మరిపించేలా సెటప్ వేశారని అక్కడ విద్యార్ధులు అందిరినీ ఎమ్మెల్యేలుగా చూస్తున్నామని ఆయన చెప్పారు. మన . బాధ్యతను గుర్తు పెట్టుకోవడానికి ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించుకున్నామని బాబు చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరిలో బాధ్యత చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఇక మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకున్నామని బాబు విద్యార్ధులకు గుర్తు చేశారు.

Tags:    

Similar News