వైసీపీ అక్రమాలపై విచారణ.. ఎవరినీ వదలం: చంద్రబాబు
వైసీపీ హయాంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు.;
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో ఎవరి పాత్ర ఉన్నప్పటి కీ.. వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. మద్యం కుంభకోణం కేసు ప్రస్తుతం విచారణ సాగుతోందన్నారు. అదేవిధంగా నాడు.. పేదల పేరుతో కోట్ల రూపాయలను దోచుకున్న జగనన్న ఇళ్ల పట్టాల విషయంపైనా విచారణ జరుగుతోందన్నారు. అలానే తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపైనా ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించామన్నారు. ఏ ఒక్క కేసును కూడా ఉదాశీనంగా వదిలి పెట్టేది లేదన్నారు. ఎవరి పాత్ర ఉన్నప్పటికీ.. వారిని ప్రజల ముందు నిలబెడతామన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం సాయంత్రం ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. రాయల సీమలోని కరువు గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతోనే రాయలసీమలో గతంలో చేపట్టిన పనులు నిలిచిపోయాయన్నారు. ఇక్కడ ఉద్యాన పంటలకు అవకాశం ఉందని తెలిపారు. దీనిని అభివృద్ధి చేయడం ద్వారా వలసలను నిరోధించే అవకాశం ఉన్నా.. గత పాలనలో పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టిందన్న చంద్రబాబు.. రాయలసీమను రత్నాల సీమగా మార్చే క్రతువుకు శ్రీకారం చుట్టామన్నారు. దీనిని ప్రపంచంలోనే నెంబర్ 1 గా మార్చుతామని చెప్పారు.
వ్యవసాయాన్ని నాశనం చేశారు..
వైసీపీ హయాంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రైతును రాజును చేసేలా పంచసూత్రాల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని వివరించారు. వ్యవసాయ రంగంలో ఏఐ(కృత్రిమ మేధ)ను తీసుకువచ్చామని తెలిపారు. అదేవిధంగా రైతులకు డ్రోన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డ్రోన్ సిటీని ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అత్యంత తక్కువ ధరలకే డ్రోన్లను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఉగాదికి 3 లక్షల ఇళ్లు..
రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇప్పటికే 2 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లను మంజూరు చేశామని సీఎం తెలిపారు. మరో 20 రోజుల్లో రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మరో 3 లక్షల మంది పేదలకు.. సొంత ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇస్తామని.. వారితో స్వయంగా గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో విశ్వాసం పెట్టుకున్నారని.. వారి అంచనాల మేరకు పనిచేస్తున్నామని చంద్రబాబు వివరించారు. సంతృప్త స్థాయి 90 శాతం నుంచి 100 శాతం చేరుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.