పిల్లలే సంపద: చంద్రబాబు సరికొత్త నినాదంపై వ్యతిరేక స్వరాలు? నెట్టింట హాట్ టాపిక్!

గత శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో జనాభా తగ్గుదలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2026-05-18 13:05 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తగా ప్రతిపాదిస్తున్న జనాభా మేనేజ్మెంట్ పాలసీపై విస్తృత చర్చ జరుగుతోంది. పిల్లలే సంపద అంటూ సరికొత్త నినాదం తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుపై అనుకూల వర్గాలలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు. ఆయనకు గట్టి మద్దతుదారుగా చెప్పే కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి సైతం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అదే సమయంలో మేథావి వర్గం నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురు, నలుగురు పిల్లలను కనమని చెప్పడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో జనాభా తగ్గుదలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో మరో ఇరవయ్యేళ్ల తర్వాత జనాభా తరుగుదల మొదలు అవుతుందని, అప్పుడు వృద్ధుల జనాభా ఎక్కువై సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధమవ్వాలని చెబుతూ కొత్తగా పెళ్లి చేసుకునేవారు, యువత ఎక్కువ మంది పిల్లలను కనేలా ఆలోచించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ముగ్గురు బిడ్డలు ఉంటే మూడో బిడ్డను ప్రసవించిన వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తామని, ఇందుకు విధి విధానాలు రూపొందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

జనాభా సంక్షోభంపై కొద్దినెలలుగా సీఎం చంద్రబాబు ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెంచేలా అధిక సంతానంను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా అధిక సంతానం కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చేసిన ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా పెద్ద డిబేట్ జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ శివరంజిని స్పందిస్తూ ‘ఈ డబ్బులు కొన్ని రోజులకే సరిపోతాయి. తర్వాత ఆ పేరెంట్స్ పిల్లల్ని పెంచగలారా? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రభుత్వాలు అధిక సంతానం ఉంటే వారికి అవసరమైన తిండి, చదువు ఇవ్వగలదా? ఎక్కువ మంది పిల్లలకు ఇళ్లల్లో వసతి ఎలా కల్పిస్తారు అంటూ ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు ప్రకటన ట్రెండ్ కాకూడదని, ఇతర రాష్ట్రాలు వీటిని పాటించకూడదని ఆశిస్తున్నానని తన ఇన్‌స్టా ఖాతాలో వీడియో విడుదల చేశారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుదారుగా రాజకీయ వర్గాల్లో చెప్పుకునే కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి సైతం తీవ్రంగా స్పందించారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం చంద్రబాబుకు బాసటగా నిలిచిన ఎంపీ రేణుక.. అధిక సంతానంపై మాత్రం బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని అనడంపై రేణుక చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం, వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో తెలుసా? అసలు మహిళల ఆరోగ్యం, వారి కెరీర్ గురించి ఆలోచించారా?" అంటూ ఎంపీ రేణుక ప్రశ్నించారు. కాగా, ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం ఉందనే కోణంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తటస్థ వర్గాలు, విద్యావంతులు, చివరికి ఆయనకు సన్నిహితంగా ఉండే వారు సైతం ఈ నినాదంపై పెదవి విరుస్తున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News