రుషికొండ ప్యాలెస్...ఆదాయ గని అవుతుందా ?

విశాఖ లోని తీర ప్రాంతంలో ఎత్తైన రుషికొండ మీద నాటి జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ప్రభుత్వానికి ఇకనైనా ఎంతో కొంత ఆదాయం తెస్తుందా అన్న చర్చ అయితే మొదలైంది.

Update: 2026-07-04 01:31 GMT

విశాఖ లోని తీర ప్రాంతంలో ఎత్తైన రుషికొండ మీద నాటి జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ప్రభుత్వానికి ఇకనైనా ఎంతో కొంత ఆదాయం తెస్తుందా అన్న చర్చ అయితే మొదలైంది. ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వం రుషికొండ విషయంలో ఇపుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఈ ప్యాలెస్ ని ఆతీధ్య రంగంలోని ప్రముఖ సంస్థలకు లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది. ఈ నెల 10 లోగా బిడ్లను వేయాలని జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సైతం ఆహ్వానం పలుకుతూ కూటమి ప్రభుత్వం కీలక అడుగులే వేసింది.

వెసులుబాటు కల్పిస్తూ :

పది ఎకరాల సువిశాల స్థలంలో ఆనాటి ప్రభుత్వం నిర్మించిన ఈ భవనాలతో పాటు ఆనుకునే ఖాళీ స్థలం కూడా ఉంది. దానిని కూడా వీలైనంత మేరకు వినియోగించుకునేలా అదనపు నిర్మాణాలు అవసరమైన మేరకు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా రుషికొండ భవనాలు అయితే మాత్రం తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించని సంగతి కూడా ప్రచారంలో ఉంది అంటున్నారు. జగన్ మరోసారి సీఎం అయితే తాను అందులో నివసించేందుకు తగిన విధంగా ఈ భవనాలను నిర్మించుకున్నారు అని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.

అనేక ప్రతిపాదనలు :

అందువల్ల వీటిని యధాతధంగా వేరే విధంగా ఉపయోగించుకోవడం వీలు కాదని ఆతిధ్య రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కూడా అనాసక్తిని గతంలో వ్యక్తం చేశారు అని వార్తలు వచ్చాయి. ఇక రుషికొండ ప్యాలెస్ ని ఎలా వినియోగించాలి అన్న దాని మీద కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ముందు అనేక ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వీటిని అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించిన మీదట ఈ విధంగా సర్కార్ బిడ్లను ఆహ్వానించింది అని అంటున్నారు.

మేలు అయిన విధానం :

ఇప్పటికే రెండేళ్ళకు పైగా రుషికొండ భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటి ద్వారా ఆదాయం ఏమీ రాకపోగా మెయింటెయిన్ చేయడానికే ఏకంగా నెలకు పాతిక లక్షల వంతున ఖర్చు అవుతోంది అని వార్తలు వచ్చాయి. దాంతో మరింత కాలం అలా ఉంచడం వల్ల సర్కార్ కి గుదిబండ తప్ప మరొకటి కాదు, అందుకే ప్రభుత్వం ఈ విషయంలో మేలైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అయితే రుషికొండ నిర్మాణానికి ఏకంగా 450 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఖర్చు చేసింది. పైగా చాలా కాలం నుంచి ఖాళీ పెట్టారు. అందువల్ల ఆ నిర్మాణ వ్యయానికి తగిన విధంగా ఆదాయం రాకపోయినా ఎంతో కొంత వచ్చినా కూడా ప్రభుత్వానికి అది లాభమే అవుతుంది అని అంటున్నారు.

కొత్త నిర్మాణాలతో :

ఇదిలా ఉంటే రుషికొండ భవనాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్త నిర్మాణాలు లీజుకు తీసుకున్న సంస్థలు చేపడతాయా అన్న చర్చ సాగుతోంది. అయితే ఏ నిర్మాణం చేపట్టాలి అన్నా కూడా పర్యావరణ నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది. అంతే కాదు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించి తీరాల్సి ఉంటుంది. అయితే అదనపు నిర్మాణాలు మాత్రం తప్పనిసరి అని అంటున్నారు. ఎందుకంటే యధాతధంగా దీనిని ఎవరూ నిర్వహించలేరు అని అంటున్నారు. ప్రముఖ ఆతీధ్య రంగ సంస్థలు కనుక రంగంలోకి దిగితే రుషికొండ ప్యాలెస్ జాతకం అయితే మారిపోతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ భవనాలు కళకళలాడడమే అంతా కోరుకుంటున్నారు అన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News