అమెరికాలో భారతీయులపై మరోసారి విద్వేషం.. హిందూ ఆలయం ఎదుట రెచ్చిపోయిన మాగా కార్యకర్త

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) అంటూ తిరిగే కొందరు మేధావులకి ఈ మధ్య పాపం నిద్రపట్టడం లేదు.

Update: 2026-07-03 14:29 GMT

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) అంటూ తిరిగే కొందరు మేధావులకి ఈ మధ్య పాపం నిద్రపట్టడం లేదు. డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్‌లో అడుగుపెట్టారో లేదో.. వీరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. ఈ క్రమంలోనే అమెరికాలో స్థిరపడిన భారతీయులను ముఖ్యంగా హెచ్1బీ వీసాల మీద వచ్చి రాత్రింబవళ్లు కష్టపడే టెక్కీలను చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఉన్న ఓ హిందూ ఆలయం సాక్షిగా ఇలాంటి విద్వేష 'కళాఖండం' ఒకటి బయటపడింది.

ఎలిజా షాఫర్ అనే ఒక సోషల్ మీడియా వీరుడు.. మగా కార్యకర్త అని చెప్పుకుంటాడు.. చేతిలో కెమెరా పట్టుకుని ఫ్రిస్కోలోని ఒక హిందూ దేవాలయం ముందుకు చేరుకున్నాడు. అక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్న చిన్న పిల్లలను చూసి ఆయనగారికి ఎక్కడో కాలిపోయింది. వెంటనే కెమెరా ఆన్ చేసి, ఆ చిన్నారులను రికార్డ్ చేస్తూ సంచలన 'ఆవిష్కరణలు' మొదలుపెట్టాడు. "నా వెనుక కనిపిస్తున్న ఈ పిల్లలంతా హెచ్1బీ వీసాదారుల పిల్లలే. వీరిని అమెరికన్లుగా పరిగణించడం ఏమాత్రం సరికాదు. వీరి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కూడా కారు" అంటూ సదరు మేధావి దేశభక్తిని ఒలకబోశాడు. అమెరికాలో పుడితే చాలు పౌరసత్వం వచ్చేస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈయనగారికి అస్సలు నచ్చలేదట.

జూలై 4 వేడుకలు చేసుకోనంత కసి..

షాఫర్ గారి ఆవేదన అంతటితో ఆగితే అది విద్వేష ప్రచారం ఎందుకవుతుంది? టెక్సాస్ వీధుల్లో భారతీయ పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారనే బాధతో.. తాను ఈసారి జూలై 4న వచ్చే 'అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని' కూడా జరుపుకోనని భీష్మించుకు కూర్చున్నాడు. అమెరికా పౌరసత్వం ఉన్న భారతీయ సంతతి పిల్లల వల్ల అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికే ముప్పు వచ్చేసిందన్నమాట.. ఇక పొలిటికల్ టచ్ ఇవ్వకుండా ఈయనగారి సోషల్ మీడియా వీడియో ఎలా పూర్తవుతుంది? అందుకే ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా టార్గెట్ చేశాడు. జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలు ఉన్న మహిళ కావడమే ఇక్కడ ఈయనగారి అసలు సమస్య. భారతీయ భార్య ఉన్న వ్యక్తులు అమెరికా ప్రభుత్వ పదవుల్లో ఉండడాన్ని తాను అస్సలు నమ్మనని, విశ్వసించనని షాఫర్ తేల్చి చెప్పేశాడు. అంటే భార్య భారతీయురాలు అయితే భర్త అమెరికాకు నమ్మకస్తుడు కాదనే వింత లాజిక్‌ను ఈయన కనిపెట్టాడన్నమాట.

గతంలో జెండాలు.. ఇప్పుడు గుడులు..

ఈ షాఫర్ గారికి భారతీయులంటే ఎంత 'అభిమానమో' చెప్పడానికి ఒక ఉదాహరణ ఉంది. గతంలో టెక్సాస్‌లో భారత జెండాను చించివేసిన ఒక వివాదాస్పద ఘటనను ఈయనే సోషల్ మీడియాలో తెగ షేర్ చేసి ఆనందించాడు. ఇప్పుడు ఏకంగా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక చిన్నారులను వీడియోలు తీస్తూ విద్వేషాన్ని నూరిపోయడం చూస్తుంటే.. ఈయనగారి మాగా భక్తి కాస్తా 'భారతీయ విద్వేషం'గా మారిందని స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈయన లాజిక్కులపై నవ్వుకుంటూనే.. చిన్నారులను టార్గెట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని భారతీయ సంఘాలు సైతం ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. గ్రీన్ కార్డ్ క్యూలో దశాబ్దాలుగా వేచి చూస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్న భారతీయులపై ఇలాంటి 'సోషల్ మీడియా వీరుల' ప్రతాపం ఎన్నాళ్లో చూడాలి.




Tags:    

Similar News