ఫ్యాక్ట్ చెక్: ఈ20 ఇంధనంపై వాట్సాప్ ప్రచారాలు వర్సెస్ శాస్త్రీయ వాస్తవాలు.. నిజమిదీ

సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న వార్త లేదా అపోహ ఎంత వేగంగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Update: 2026-07-04 01:30 GMT

సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న వార్త లేదా అపోహ ఎంత వేగంగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలి కాలంలో E20 పెట్రోల్ గురించి ఇలాంటి అనేక రకాల పోస్టులు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. "E20 వల్ల ఇంజిన్లు కాలిపోతాయి", "పెట్రోల్ ట్యాంకుకు చీమలు వస్తాయి", "బీమా వర్తించదు" అంటూ వస్తున్న ప్రచారాలు వాహనదారుల్లో తీవ్ర ఆందోళనను, గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మరి ఈ ప్రచారాల్లో ఎంతవరకు నిజముంది? శాస్త్రీయ ఆధారాలు ఏం చెబుతున్నాయి? అన్న దానిపై కేంద్రం, నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.

ఈ20 పెట్రోల్ అంటే ఏమిటి?

ఈ20 అంటే 80 శాతం పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్‌ను కలిపిన ఇంధనం. ఇందులో ఉపయోగించే ఇథనాల్‌ను ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, పాడైన ధాన్యాలు మరియు ఇతర వ్యవసాయ ముడి పదార్థాల నుండి బయో-రిఫైనరీలలో తయారు చేస్తారు. విదేశాల నుండి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం... హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని రక్షించడం... దేశీయంగా రైతుల నుండి వ్యవసాయ వ్యర్థాలను కొనుగోలు చేయడం ద్వారా వారికి అదనపు ఆదాయాన్ని కల్పించడం ధ్యేయంగా ఈ20 పెట్రోల్ ను కలుపుతున్నారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణ సందర్భంగా ఇథనాల్ విధానానికి సంబంధించి "ప్రయోగం" అనే పదం వినిపించడంతో సోషల్ మీడియాలో అది ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ప్రభుత్వం ప్రజలపై ప్రయోగాలు చేస్తోందంటూ కొందరు వక్రీకరించారు. అయితే తర్వాత అటార్నీ జనరల్ దీనిపై స్పష్టతనిస్తూ... ఆ వ్యాఖ్య కేవలం "ఇథనాల్ సరఫరా విధానం, క్షేత్రస్థాయి అమలు ప్రక్రియకు" సంబంధించినదేనని.. ప్రజలను ప్రయోగ పశువులుగా వాడుతున్నారని కాదని స్పష్టం చేశారు. కానీ.. అప్పటికే పూర్తి సందర్భం లేకుండా కట్ చేసిన వీడియోలు ప్రజల్లో అనుమానాలను నాటేశాయి.

ఈ20 వల్ల ఇంజిన్ పూర్తిగా పాడవుతుందా?

ఈ20 ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఆధునిక వాహనాలన్నీ ఈ20 అనుకూల ఇంజిన్లతోనే తయారవుతున్నాయి. వీటిలో ఈ ఇంధనాన్ని నిశ్చింతగా వాడవచ్చు. అయితే చాలా పాత మోడల్ వాహనాల విషయంలో తయారీ కంపెనీల సూచనలను ఒకసారి పరిశీలించడం మంచిది.

మైలేజ్ భారీగా (20-30%) తగ్గిపోతుందా?

ఈ ప్రచారంలో కొంత నిజం, చాలావరకు అతిశయోక్తి ఉన్నాయి. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి విలువ కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మైలేజ్‌లో కేవలం 1 నుండి 3 శాతం వరకు స్వల్ప మార్పు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే తప్ప సోషల్ మీడియాలో చెబుతున్నట్లు 20-30% మైలేజ్ పడిపోవడం అనేది పూర్తిగా అవాస్తవం.

ఈ20లో చక్కెర ఉంటుంది కాబట్టి చీమలు వస్తాయా?

ఇది పూర్తిగా నవ్వించదగ్గ, తప్పుదారి పట్టించే ప్రచారం. ఇథనాల్ అనేది చెరకు రసం కాదు. ఇది అనేక రసాయన, శుద్ధి ప్రక్రియల ద్వారా తయారయ్యే 'ఇండస్ట్రియల్ గ్రేడ్' ఆల్కహాల్. ఇందులో చక్కెర శాతం అస్సలు ఉండదు. కాబట్టి చీమలు వచ్చే ప్రసక్తే లేదు. చెరకు రసం లేదా ధాన్యాల నుండి సేకరించిన పదార్థాలను అధునాతన ల్యాబ్‌లలో డీహైడ్రేషన్ చేసి, 99 % స్వచ్ఛమైన ఇంధన గ్రేడ్ ఇథనాల్‌గా మార్చిన తర్వాతే పెట్రోల్‌లో నిర్ణీత నిష్పత్తిలో కలుపుతారు.

ఈ20 వాడితే ఇన్సూరెన్స్ రద్దవుతుందా?

కేంద్ర ప్రభుత్వం, బీమా నియంత్రణ సంస్థలు ఈ వాదనను పూర్తిగా ఖండించాయి. కేవలం ఈ20 పెట్రోల్ వాడినంత మాత్రాన వాహన బీమా క్లెయిమ్‌లు రద్దవుతాయనడానికి ఎలాంటి నిబంధనలు లేవు.

అంతర్జాతీయంగా ఇథనాల్ వినియోగం

భారత్ మాత్రమే ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్దాలుగా ఇథనాల్‌ను విజయవంతంగా వాడుతున్నాయి. బ్రెజిల్ లో 25% నుండి 27% వరకు కొన్ని వాహనాల్లో 100% ఇథనాల్ కూడా వాడతారు. అమెరికాలో ఈ10 (10%), ఈ15 (15%) ఇంధనాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. జపాన్ లో పర్యావరణ హిత ఇంధన విధానాల్లో భాగంగా ఇథనాల్ వినియోగం పెంచుతోంది.

వాహనదారుల నిజమైన ఆందోళనలు ఏంటి?

చాలా పాత వాహనాలు బీఎస్ -4, అంతకంటే పాతవి ఉన్నవారికి దీర్ఘకాలంలో ఇంజిన్ భాగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో వాహనాల నిర్వహణ వ్యయం ఏమైనా పెరుగుతుందా? అన్న అంశాలపై ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు, శాస్త్రవేత్తలు నిరంతరం అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో పాత వాహనాల కోసం ప్రత్యేక ఇంధన వేరియంట్లు లేదా ప్రత్యామ్నాయాలను స్పష్టం చేసే అవకాశం ఉంది.

ఈ20 పెట్రోల్‌పై జరుగుతున్న చర్చలో వాస్తవాల కంటే సోషల్ మీడియా సృష్టించిన హైప్, భయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంధన స్వయంసమృద్ధి వైపు దేశం అడుగులు వేస్తున్న తరుణంలో ఇలాంటి మార్పులు సహజం. కాబట్టి వాట్సాప్ ఫార్వార్డ్‌లు, ఫేస్‌బుక్ వీడియోలను చూసి ఆందోళన చెందకుండా... అధికారిక ప్రభుత్వ ప్రకటనలు, శాస్త్రీయ ఆధారాలు, మీ వాహన తయారీ సంస్థ సూచనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. అవగాహనతో కూడిన నిర్ణయాలే మనకూ.. దేశానికీ మేలు చేస్తాయి..

Tags:    

Similar News