పవన్ చేతిలో నివేదిక....సోషల్ మీడియా పైనే ఫోకస్ !
సోషల్ మీడియాను దేశంలో కట్టడి చేయడం బహు కష్టంగా మారుతోంది. సోషల్ మీడియా అన్నది ఒక బ్రహ్మాండమైన ఆయుధం.
సోషల్ మీడియాను దేశంలో కట్టడి చేయడం బహు కష్టంగా మారుతోంది. సోషల్ మీడియా అన్నది ఒక బ్రహ్మాండమైన ఆయుధం. ఇదివరకూ ఎవరైనా తమ టాలెంట్ ని బయట పెట్టుకోవాలంటే మీడియాను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎవరికి వారుగా తాము ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నారు. టాలెంట్ ఉంటే ఆకాశమే హద్దుగా అవకాశాలు అందుకుంటున్నారు. ఇదంతా పాజిటివ్ గా వస్తున్న సక్సెస్ స్టోరీస్. నాణేనికి రెండోవైపు చూస్తే కనుక సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్ పాపులర్ కావాలని ఆలోచించేవారు అంతా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సెలిబ్రిటీస్ ని టార్గెట్ చేసుకుని పోస్టులు పెడుతున్నారు. రాజకీయాల మీద ఎంత వరకూ అవగాహన ఉందో తెలియదు కానీ విమర్శల పేరుతో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
పవన్ ఇచ్చిన సందేశం :
ఈ క్రమంలో సోషల్ మీడియా హద్దులు ఏమిటో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన తాజా వీడియో సందేశం ద్వారా జనాలకు వివరించారు. ఆధారాలతో చేసే సహేతుకమైన విమర్శలకు ఎపుడూ ఆహ్వానం ఉంటుందని అదే సమయంలో రెచ్చిపోయి బ్యాడ్ పోస్టింగ్ పెడితే బాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు అని ఎవరూ అనడం లేదని కానీ పరిమితిలు మంచి భాష ఇవన్నీ కూడా తెలుసుకోవాలని పవన్ ఇచ్చిన సందేశం మీద చర్చ మొదలైంది.
ఈగల్ విభాగం చీఫ్ భేటీ :
ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ తాజాగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆయన పవన్ కళ్యాణ్ కి అందజేశారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ఈ విషయం ఈగల్ విభాగంలో సాధించిన ఫలితాలను కూడా నివేదికలో పొందుపరచినట్లుగా తెలిపారు. సోషల్ మీడియా వేధింపులు అదే విధంగా ట్రోలింగ్ అంశాలతో పాటు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకుంటున్న కఠిన చర్యలను ఉప ముఖ్యమంత్రికి సైబర్ క్రైమ్ ఐజీ వివరించారు.
సీరియస్ గానే :
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టవచ్చు అనుకుంటే ఇక మీదట కుదరదు అన్న సందేశాన్ని అయితే కూటమి ప్రభుత్వం పంపించడానికి సిద్ధం అవుతోంది. అనుచిత పోస్టింగులు చేసి రెచ్చిపోతే మాత్రం అంతకు అంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. సర్కార్ సీరియస్ గానే ఈ విషయంలో వ్యవహరిస్తుందని అంటున్నారు. దాంతో ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేందుకు ఉత్సాహపడితే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి వద్దకు సైబర్ క్రైమ్ ఐజీ వెళ్ళడం ఈ విషయాల మీద చర్చించడం పట్ల ఆసక్తి వ్యక్తం అవుతోంది. పవన్ కి సంబంధించిన శాఖలు ఇవి కాకపోయినా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతే కాదు సోషల్ మీడియా లో అనుచిత పోస్టింగుల పట్ల ఆయన గట్టిగానే ప్రభుత్వం ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ భేటీకి విశేష ప్రాధాన్యత ఏర్పడుతోంది అని అంటున్నారు.