అమరావతి అంటే ...బాబు ఇదే చెప్పింది !
అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారంగా కాకుండా విజయవాడ గుంటూరుతో కలిపి చూడాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
అమరావతి అంటే ఏమిటి ఏపీకి రాజధాని అని వెంటనే జవాబు వస్తుంది. ఆ వెంటనే అమరావతి అంటే దాని పరిధి ఏమిటి అని కూడా ప్రశ్న వస్తుంది. అమరావతి అంటే భూములు ఇచ్చిన ప్రాంతాలేనా అన్న డౌట్ కూడా వస్తుంది. అంతే కాదు ఆ యాభై ఎకరాలో లక్ష ఎకరాలో ఆ పరిధిలో నిర్మించే భవనాలు ఆఫీసులు కార్యాలయాలేనా అన్న చర్చ కూడా వస్తుంది. ఇక విపక్షాలు ప్రత్యేకించి వైసీపీ లాంటి పార్టీలు అమరావతి అంటే కేవలం 29 గ్రామాలకే అన్నట్లుగా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే గతంలో వీటి మీద పెద్దగా పట్టించుకోని టీడీపీ పెద్దలు ఇపుడు మాత్రం కౌంటర్ రెడీ చేసుకున్నారు. అంతే కాదు జనాలకు కూడా వివరించాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి అంటే అక్కడే కాదు అంతటా అన్న భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. తాజాగా ఆయన మరొసారి అదే మాట అన్నారు.
అంతా కలిపి చూడాలి :
అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారంగా కాకుండా విజయవాడ గుంటూరుతో కలిపి చూడాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దుకు తగిన విధంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్ట్ పనులు జరగాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపుపైనా దృష్టి పెట్టాలని సూచించారు. ఇక మీదట తాను కూడా స్వయంగా అమరావతి రాజధాని పనులను పరిశీలిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో రాజధాని అమరావతి నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
మావిగన్ అంటూ :
ఇక వైసీపీ విషయం తీసుకుంటే ఆ మధ్యన జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. అందులో మచిలీపట్నం, విజయవాడ గుంటూర్ లను ఆయన కలిపారు. అమరావతి వేరు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే దానికి అప్పట్లోనే చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అమరావతి రాజధానిలోనే గుంటూరు విజయవాడ ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఇపుడు మరింత స్పష్టత ఇస్తూ రాజధాని ప్రాంతం అంటే ఏమిటో అధికారులకు పరిధి పూర్తిగా వివరించారు. అన్ని చోట్లా అభివృద్ధి పెద్ద ఎత్తున సాగాల్సిన అవసరం ఉందని అన్నారు.
క్వాలిటీతో కూడిన వేగం :
అమరావతి రాజధాని పనులలో స్పీడ్ పెరగాలని బాబు కోరారు. అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ లక్ష్యంగా రాజధాని పనులు జరగాలని దిశా నిర్దేశం చేశారు. గతంతో పోల్చితే పనుల్లో వేగం కొంత మేర పెరిగినా అది చాలదని ఇంకా వేగం పెంచాలని అన్నారు. ఒక నిర్మాణ సంస్థగా రాజధాని పనులు చేపట్టడం గొప్ప అవకాశమని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాబు సూచించారు. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో చేసే పనులలో ఎక్కడా జాప్యం ఉండకూదని బాబు స్పష్టం చేశారు. రాజధానిలో 95 ప్రాజెక్టులకు సంబంధించి 50,999 కోట్ల రూపాయల పనులు చేపట్టగా ఇందులో నెలకు కనీసం 7.92 శాతం పనులు జరగాలని కూడా బాబు సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్లు వంటి అంశాలలో అన్ని శాఖలు, ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని బాబు ఆదేశించడం విశేషం.