బాబు అనుభవం అంటే అదే మరి !

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ముందు ఎవరూ సాటి రారు.;

Update: 2025-05-12 10:30 GMT
Chandrababu Naidu’s Experience Shines in Strategic Nominated Posts

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ముందు ఎవరూ సాటి రారు. ఆ మాటకు వస్తే మొత్తం భారత దేశంలో బాబు మాదిరిగా ఓపిక పూర్తి విషయ జ్ఞానం అనుభవం కలిగిన వారు ఎవరూ లేరు అని కూడా చెప్పవచ్చు. ఏపీలో కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ బాబుకు సరిసాటి మరొకరు లేరు అన్నది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. ఆయన జీవితం మొత్తం అనుభవ సారం. ఆయన నడిచే రాజకీయ విశ్వవిద్యాలయం అని కూడా చెప్పాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకు అంటే బాబు ఏమి చేసినా పక్కాగా ఉంటుంది. ఆయనకు ఎవరికి ఏమి చేయాలో ఏ సమయంలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో బాగా తెలుసు అంటారు. బాబు దగ్గర ఒక నాయకుడు పనిచేస్తున్నారు అంటే ఆయన గురించి మొత్తం స్కాన్ చేస్తారు. అతనిలోని ప్లస్ లు మైనసులు చూస్తారు.

మైనసులను తగ్గించే ప్రయత్నం చేస్తూనే ప్లస్ లను బాగా వాడుకుంటారు. ఇక ఆ నాయకుడి సామర్ధ్యానికి తగిన పదవులను కూడా ఇస్తారు. చంద్రబాబు వద్ద అడిగితే పదవులు రావు, వారి పనితీరుతోనే పదవులు ఆయన ఇస్తారు. ఆయనను నమ్మి వారు ఎవరూ మోసపోలేదు. అలాగే బాబు నేర్పిన పని సంస్కృతిని నమ్మి ఎదిగిన వారే ఎంతో మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా రెండు రాష్ట్రాలలో బ్రహ్మాండమైన నాయకత్వాన్ని అందించిన బాబు ఏ చిన్న పదవి విషయంలో అయినా ఎంతో ఆలోచించి ఎంపిక చేస్తారు.

అది ఎమ్మెల్యే ఎంపీ టికెట్ దాకా అయినా మంత్రి పదవి అయినా రాజ్యసభ అయినా నామినేటెడ్ పదవి అయినా బాబు మార్క్ ఉండాల్సిందే. లేటెస్ట్ గా బాబు నామినేటెడ్ పదవులు చాలా ఎంపిక చేశారు. బాబు ఎంపికలు చూసిన వారికి అనిపించేది ఒక్కటే. సమర్ధులకే ఆయన అవకాశాలు ఇచ్చారు అని. పదవులు అలంకారం కాదు, వాటి వల్ల వారు ఎలివేట్ కావాలి, అదే విధంగా ప్రజలకు పార్టీకి ప్రభుత్వానికి మేలు చేయాలి.

అలా ఆయన ఆలోచించే ఆప్కాబ్ చైర్మన్ పదవిని గన్ని వీరాంజనేయులుకు ఇచ్చారు. ఇది మంచి నాయకుడికి మంచి పదవి ఇచ్చారు అని అంతా అంటున్నారు. అలాగే రాయపాటి శైలజకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని ఇచ్చారు. ఆమె ఎంతో సమర్ధురాలుగా ఉన్నారు. విద్యాధికురాలుగా మంచి నాయకురాలిగా ఆమె కనిపిస్తారు. అమరావతి రాజధాని ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఒక మహిళా శక్తిగా ఉన్న ఆమెకు ఈ పదవి కచ్చితంగా సరిపోతుంది అని అంటున్నారు.

అదే విధంగా డీసీసీబీ చైర్మన్ల పదవులు కూడా ప్రాంతాల వారీగా సామాజిక వర్గాల సమీకరణలతో పాటు కష్టపడి పనిచేసేవారికి గుర్తింపుగా ఇచ్చారు. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని ఆలపాటి సురేష్ కి ఇచ్చారు. ఆయన కూడా ప్రెస్ కి ఈ పదవిలో బాగా చేస్తారు అని అంటున్నారు.

ఇక మాజీ మంత్రులు పీతల సుజాతకు అలాగే కేఎస్ జవహర్ కి కీలక పదవులు దక్కాయి. మొత్తం జాబితా చూసుకుంటే పార్టీ కోసం పనిచేసిన వారికి కష్టకాలంలో అట్టిపెట్టుకుని ఉన్న వారికి అందరినీ గుర్తు పెట్టుకుని వారి సామర్ధ్యానికి తగిన విధంగా పదవులు ఇచ్చిన చంద్రబాబుని అంతా అభినందిస్తున్నారు. నాయకుడు అంటే ఇలాగే ఉండాలి కదా అని అంటున్నారు.

గతంలో జగన్ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా నామినేటెడ్ పదవులు పందేరం జరిగింది. వాటిని ఇచ్చిన తీరు చేసిన ఎంపికతో పోలిస్తే బాబు పెర్ఫెక్ట్ అని అంటున్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ నామినేటెడ్ పదవులను తమ భజన పరులకు ఇచ్చిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ విధంగా పదవులు అందుకున్న వారు అంతా ఈ రోజున వైసీపీ కోసం పనిచేయడం లేదు, ఎక్కడా కనిపించడం లేదు అంటే ఆ ఎంపికలు ఎలా ఉన్నాయో అని చర్చించుకుంటున్నారు. మొత్తానికి బాబు అనుభవం అంటే ఇదే అని అంటున్నారు. ఆయన ఆలోచించి మరీ అవకాశాలు ఇస్తారు. లేట్ గా అయినా లేటెస్ట్ గా ఆయన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News