పీ-4 స్ఫూర్తి.. మార్గదర్శిగా చంద్రబాబు

అయితే సీఎం చంద్రబాబు దత్తత తీసుకునే కుటుంబాలను ఇంకా గుర్తించాల్సివుందని అంటున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడతారా?;

Update: 2025-07-25 16:42 GMT

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకం పీ-4. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్షిప్ తో సమాజంలో అట్టడుగున ఉన్న వారికి సాయం చేయాలని ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులు, సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిస్తారు. ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా, ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని మార్గదర్శులుగా పిలుస్తున్నారు. సమాజంలో టాప్ 10 పర్సెంటులో ఉన్నవారు అట్టడుగున ఉన్న 20 పర్సెంట్ పేదలకు సాయం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, పేద కుటుంబాలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా దీర్ఘకాలిక సాధికారతను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. ఇది ఒక సామాజిక విప్లవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణిస్తున్నారు.

సీఎం పిలుపుతో ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు పేద కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. అమరావతిలో పీ-4పై ప్రత్యేక కార్యక్రమం చేపట్టి పేదలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా సమాజసేవ చేయాలని సీఎం సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని సీఎం సూచిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడాలని అధికారులకు బాధ్యత అప్పగిస్తున్నారు. గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అదే ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలను ప్రోత్సహించాలనేది సీఎం ఉద్దేశం. ఈ విధానం ద్వారా వచ్చే ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను ఎంపిక చేయాలని, వారి బాధ్యతను మార్గదర్శులకు అప్పగించాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

అయితే ప్రస్తుతం 5 లక్షల 74 వేల కుటుంబాలను దత్తత తీసుకోడానికి 57 వేల 503 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారు. సీఎం ఆకాంక్షలకు తగ్గట్టు 15 లక్షల కుటుంబాలకు ప్రయోజనం దక్కాలంటే మొత్తం రెండు లక్షల మంది మార్గదర్శులు అవసరం. ఇక తన పిలుపుతో 50 వేల మంది ఆర్థిక దన్ను ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆనందం వ్యక్తం చేసిన సీఎం.. తాను కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటానని తాజాగా ప్రకటించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతోపాటు తన కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములు అవుతారని ఆయన వెల్లడించారు.

అయితే సీఎం చంద్రబాబు దత్తత తీసుకునే కుటుంబాలను ఇంకా గుర్తించాల్సివుందని అంటున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపడతారా? లేక మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా? అనేది కూడా తేలాల్సివుంది. ప్రస్తుతం చంద్రబాబు కుప్పంలో ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ మంగళగిరిలో శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు కాకుండా టీడీపీకి కంచుకోట వంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. హిందూపురం, టెక్కలి, ఉండి ఇలా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంతవరకు ఓటమే లేదని చెబుతున్నారు. దీంతో చంద్రబాబు దత్తత తీసుకునే కుటుంబాలు ఏయే నియోజకవర్గాల్లో ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తోంది. చంద్రబాబు కుటుంబం యాజమాన్యంలో ఉన్న హెరిటేజ్ డెయిరీ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తమ వ్యక్తిగత ఆదాయాన్ని కూడా పేదలకు కేటాయించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News