బాబు అన్నీ లెక్కలు చూస్తున్నారా.,..!
ఎమ్మెల్యేల విషయంలో టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలిస్తున్నారు.;
ఎమ్మెల్యేల విషయంలో టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ప్రజల మధ్య ఉండడం లేదన్న చర్చ నడిచింది. దీనిపై పదే పదే చంద్రబాబు హెచ్చరించారు. వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు ఎవరి దారిలో వారు నడుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా పార్టీకి తరచుగా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ విషయాన్ని పరిశీలించిన చంద్రబాబు తాజాగా నాలుగు అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేశారు.
ఒకటి ప్రజా దర్బార్ నిర్వహణ. ఈ విషయంలో అనేకమంది ఎమ్మెల్యేలు వెనకబడుతున్నారనేది పార్టీకి అందిన సమాచారం. ప్రజాదర్బార్లు అంటే వారానికి ఒకసారి.. లేదా 15 రోజులకు ఒకసారి నిర్వహించి చేతులు దులుపుకోవడం కాదన్నది పార్టీ చెబుతున్న మాట. నిరంతరం అవి కొనసాగాలని, తద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాయకులకు తగిన అవకాశం లభిస్తుందని సమయం కూడా దక్కుతుందని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఈ విషయాన్ని మరోసారి ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. ఇకనుంచి ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహించాలని.. ఏదైనా అత్యవసరమైన పరిస్థితి ఉంటే తప్ప ప్రజాదర్బార్ ని వదిలిపెట్టకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఇక రెండోది.. మీడియా సమావేశాలు. మీడియా సమావేశాలను తరచుగా నిర్వహించాలని నాయకులకు చంద్రబాబు ఇప్పటికే సూచించారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా స్థానికంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు మీడియా సమావేశాలు అత్యంత కీలకంగా మారతాయని కూడా ఆయన సూచించారు. అయినప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు మీడియా సమావేశాలు నిర్వహించింది లేదన్నది పార్టీ దగ్గర ఉన్న సమాచారం. దాదాపు 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు అని తాజాగా చంద్రబాబు చెప్పిన మాట.
ఇకనుంచి అలా జరగడానికి వీలులేదని తరచుగా మీడియా సమావేశాలు నిర్వహించి కచ్చితంగా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా చెప్పారు. మూడో విషయం సోషల్ మీడియాలో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన తీరు. దీనిపై స్పష్టంగా చంద్రబాబు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. సోషల్ మీడియా ఇప్పుడు ప్రజలకు అత్యంత చేరువ అయిందని.. దీనిని వినియోగించుకుని ప్రజలకు చేరువ కావాలని ఆయన సూచించారు. అవసరమైతే రీల్స్ చేయాలని అదేవిధంగా సెల్ఫీ వీడియోలు చేసి అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శలు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని ఎమ్మెల్యేలకు చెప్పారు.
నాలుగో అంశం సామాజిక సేవ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పీ4ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు కూడా దోహదపడాలని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో p4 ను అమలు చేసేందుకు నాయకులు ముందుకు రావాలని సమాజంలో ప్రజలకు సేవ చేయాలనుకునే వారిని వెతికి పట్టుకుని వారిని అనుసంధానం చేసుకోవాలని చెప్పారు. దీనికి తగిన విధంగా కార్యక్రమాలను రూపొందించాలని మరోసారి తాజాగా ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పారు. మొత్తంగా ఇలా నాలుగు అంశాలపై సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.