నారా ఫ్యామిలీ @ 5 అవార్డులు.. చంద్రబాబు ఫ్యామిలీకి 2025 చాలా స్పెషల్!
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి ఈ ఏడాది ఎప్పటికీ గుర్తు ఉండి పోతుంది. 2024లో చిరస్మరణీయ విజయం అందుకున్న చంద్రబాబు.. రాష్ట్రంలో నవ చరిత్రను స్థాపించారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి ఈ ఏడాది ఎప్పటికీ గుర్తు ఉండి పోతుంది. 2024లో చిరస్మరణీయ విజయం అందుకున్న చంద్రబాబు.. రాష్ట్రంలో నవ చరిత్రను స్థాపించారు. ఇక 2025లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వృద్ధి సాధనలో జాతీయ సగటును మించి రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించడమే కాకుండా సీఐఐ సమ్మిట్ నిర్వహించి మూడు రోజుల్లో ఏకంగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించారు. అదేవిధంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్, క్వాంటం వ్యాలీ వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. 18 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఆరు నెలలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే సరిపోయిందని చెబుతున్నారు. కానీ, గత 12 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతినే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
సీఐఐ సదస్సుతోపాటు ఇతర ఒప్పందాల ద్వారా ఒక్క ఏడాదిలోనే సుమారుగా 16 లక్షల పెట్టుబడులు సాధించినట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబుకు 2025 వ్యక్తిగతంగా కుటుంబపరంగా మరచిపోలేని మధురానుభూతిని ఇచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎకనామిక్ టైమ్స్ ప్రదానం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం సీఎంకు లభించడం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతల్లో ఇంతకు ముందు ఎవరికీ ఇలాంటి అవార్డు రాలేదు. పాలనలో తెచ్చిన సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు గానూ ఈ అవార్డు దక్కింది.
మరోవైపు చంద్రబాబు సతీమణి కూడా ఈ ఏడాది రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ MDగా ఉన్న భువనేశ్వరి ఐఓడీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డుతోపాటు గోల్డెన్ పికాక్ అవార్డుకు ఎంపికయ్యారు. నవంబరులో లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రెండు అవార్డులను భువనేశ్వరి స్వీకరించారు. NTR ట్రస్ట్ ద్వారా ప్రజారోగ్యం, విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో భువనేశ్వరి చేసిన కృషికి గానూ 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్' (IOD) డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు బహూకరించింది. అదే సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలో అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ పాటించినందుకు గానూ గోల్డెన్ పికాక్ అవార్డు దక్కింది.
ఇక అత్తకు తగ్గ కోడలుగా నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డుకు ఎంపికయ్యారు. వ్యాపార రంగంలో బ్రాహ్మణి చూపుతున్న నాయకత్వ పటిమకు గుర్తింపుగా బిజినెస్ టుడే' బీటీ మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ గా ఎంపిక చేసింది. ఇలా నారా కుటుంబంలో రెండు తరాల వారు అవార్డులు కైవసం చేసుకుంటే.. మూడో తరానికి చెందిన చంద్రబాబు ముద్దుల మనవడు నారా దేవాన్ష్ సైతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతి తక్కువ సమయంలో అంటే కేవలం 1 నిమిషం 43 సెకన్లలో 175 చెస్ చెక్‌మేట్ పజిల్స్‌ను పరిష్కరించిన దేవాన్ష్ 'ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్'గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లండన్‌లో ఈ అవార్డును అందుకున్న చిరంజీవి దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులోనూ చోటు సంపాదించాడు.
ఒకే ఏడాదిలో మూడు తరాలకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం సంపాదించడం విశేషంగా చెప్పాలి. మొత్తానికి 2024 లానే 2025 కూడా చంద్రబాబు కుటుంబానికి సువర్ణావకాశాలను కల్పించిందని చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబంలో మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు ఉండగా, కుమారుడు మంత్రి లోకేశ్ తప్పించి మిగిలిన అందరికీ ఏదో ఒక అవార్డు రావడం గమనార్హం. లోకేశ్ కూడా ఈ ఏడాది పార్టీ పగ్గాలు అందుకుంటారని ప్రచారం జరిగినా, అనుకోని జాప్యంతో కుదరలేదని అంటున్నారు. కానీ, మంత్రిగా తన పనితీరుతో లోకేశ్ ప్రభుత్వంలో స్పష్టమైన ముద్ర వేశారని అంటున్నారు. మొత్తంగా చూస్తే 2025 చంద్రబాబు కుటుంబానికి బాగా కలిసివచ్చిన ఏడాదిగానే వ్యాఖ్యానిస్తున్నారు.