ఆ తరహా కార్యక్రమాలకు చంద్రబాబు దూరం..? 95 సీఎంలో ఈ సడన్ ఛేంజ్ దేనికి!
టీడీపీ అధినేతగా చంద్రబాబు సుమారు 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 1995లో పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించిన చంద్రబాబు మూడు దశాబ్దాలుగా పార్టీ కేడరుకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు తీరులో మార్పు వస్తుందా? 95 సీఎం అంటూ పదేపదే చెబుతున్న చంద్రబాబు.. ఆచరణలో కొంత విరుద్ధంగా నడుచుకుంటున్నారా? అంటే ఓ విషయంలో ఔను అనే సమాధానమే వినిపిస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో యథావిధిగా యాక్టివ్ గానే ఉంటున్నా, ప్రైవేటు కార్యక్రమాల విషయంలో మాత్రం తన వైఖరి మార్చుకున్నారని అంటున్నారు. ఆయనలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుపై విస్తృత చర్చ జరుగుతోంది.
టీడీపీ అధినేతగా చంద్రబాబు సుమారు 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 1995లో పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించిన చంద్రబాబు మూడు దశాబ్దాలుగా పార్టీ కేడరుకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పరమైన బంధమే కాకుండా పార్టీ నేతలు, కేడర్ తో చంద్రబాబు వ్యక్తిగత, కుటుంబ అనుబంధం ఏర్పరుచుకున్నారు. టీడీపీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నవారు చంద్రబాబును తమ పెద్ద దిక్కుగా భావిస్తారు. అందుకే తమ ఇంట్లో ఏ శుభ కార్యక్రమమైనా చంద్రబాబును ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారు. చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి ఎంత బిజీగా ఉన్న తన కుటుంబ సభ్యులు లాంటి పార్టీ నేతల కార్యక్రమాలకు విధిగా హాజరవుతారు. 1995 నుంచి చంద్రబాబు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇక నాలుగోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తాను బాధ్యతలు స్వీకరించిన కొత్తలో తనకు 75 ఏళ్లు వచ్చాయని ఎవరూ అనుకోవద్దని ఇప్పటికీ తాను 1995 సీఎంలా పనిచేయగలనని చెప్పారు.
అయితే, 1995 సీఎంగా ఉంటానన్న చంద్రబాబు పాలనలో అదే దూకుడు ప్రదర్శిస్తున్నా, పార్టీ నేతల ఇళ్లలో జరిగే కార్యక్రమాల విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గి తన తనయుడు లోకేశ్ ను ముందు పెడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లలో ఏ శుభకార్యక్రమం జరిగినా చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఆయన బదులు కుమారుడు లోకేశ్ నే పంపుతున్నారు చంద్రబాబు. దీనికి కారణం సీఎంగా ఆయన బిజీగా ఉండటం మాత్రం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పార్టీ నేతల ప్రైవేటు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. తన స్థానంలో కుమారుడు లోకేశ్ ను పంపడం ద్వారా పార్టీ నేతలతో ఆయనకు మరింత మంచి సంబంధాలు ఏర్పడేలా చేస్తున్నారని చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రైవేటు కార్యక్రమం జరిగినా లోకేశ్ స్పెషల్ గెస్ట్ గా కనిపిస్తున్నారు. ఆదివారం పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి రామానాయుడు కుమార్తె వివాహ నిశ్చయ కార్యక్రమంలో లోకేశ్ స్పెషల్ అపీరియన్స్ ఆకట్టుకుంది. నిమ్మల కుటుంబ సభ్యులతోపాటు పార్టీ నేతలతో లోకేశ్ ముచ్చటించిన వీడియోలు, అక్కడ ఆయన వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలోనూ లోకేశ్ సందడి కనిపించింది. ఇక టీడీపీలో కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో జరిగిన వివాహానికి కూడా లోకేశ్ మాత్రమే వెళ్లడాన్ని ప్రత్యేకంగా చెబుతున్నారు. దేవినేని ఉమా టీడీపీ అధిష్టానానికి చాలా ఆప్తుడు.. దాదాపు 40 ఏళ్లుగా దేవినేని కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. ఆయన ఇంట కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చారు. కానీ, పక్కనే ఉన్న చంద్రబాబు వెళ్లకుండా లోకేశ్ ను పంపారు. దీనికి ప్రధాన కారణం పార్టీలో సీనియర్, జూనియర్ నేతలు అందరితోనూ లోకేశ్ కు అనుబంధం పెరగాలనే ఆలోచన ఒక్కటే అని చెబుతున్నారు.
టీడీపీ భావి నేతగా లోకేశ్ ను చాలాకాలంగా ప్రమోట్ చేస్తున్నారు. చంద్రబాబు స్థానంలో అన్నిరకాల బాధ్యతలకు లోకేశ్ అర్హుడని, ఆయన సమర్థుడని, చంద్రబాబులా వ్యక్తిగత సంబంధాలకు కూడా లోకేశ్ విలువనిస్తారనే సంకేతాలు పంపడమే ఆలోచన కారణంగా ప్రైవేటు కార్యక్రమాలకు లోకేశ్ ను పంపుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే పార్టీ బలంతోపాటు వ్యక్తిగత అనుబంధాలు కూడా ముఖ్యమని చంద్రబాబు నమ్ముతారని చెబుతారు. అందుకే పార్టీ కార్యకర్తలకు ఆపద అన్నా, వారి ఇళ్లలో కార్యక్రమాలు అన్నా చంద్రబాబు స్పందిస్తుంటారని చెబుతారు. ఈ పద్ధతి లోకేశ్ కూడా అనుసరించాలని, పార్టీ కార్యకర్తలు, నేతలతో వ్యక్తిగత సంబంధాలు పెరిగితే వారు కూడా మనస్ఫూర్తిగా లోకేశ్ నాయకత్వాన్ని సమర్థిస్తారని చంద్రబాబు ఆలోచనగా ఉందంటున్నారు. బలవంతంగా లోకేశ్ నాయకత్వాన్ని రుద్దే బదులు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు అన్నింటిలోనూ లోకేశ్ తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.