చంద్రబాబుకు ఊహించని ప్రశ్న.. యువరైతు మాటలకు నవ్వు ఆపుకోలేకపోయిన సీఎం

ఈ సందర్భంగా ఓ పొలం వద్ద యువ రైతు నీట మునిగిన చేనును చూస్తూ దిగాలుగా ఉండగా సీఎం అక్కడికి వెళ్లారు.;

Update: 2025-10-30 06:14 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు బుధవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ లో హెలికాఫ్టర్ దిగిన చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. తుఫాన్ షెల్టర్లలో ఉన్న బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత నీట మునిగిన పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఓ పొలం వద్ద యువ రైతు నీట మునిగిన చేనును చూస్తూ దిగాలుగా ఉండగా సీఎం అక్కడికి వెళ్లారు. అధికారులు ఆ యువకుడిని సీఎం వద్దకు పిలిచారు. ఇక తన వద్దకు వచ్చిన యువకుడిని ఉద్దేశించి చదువుకోవడం లేదా? అంటూ సీఎం చంద్రబాబు అడిగారు. దీనికి స్పందించిన ఆ యువకుడు ‘‘అందరూ చదువుకుంటే వ్యవసాయం ఏమైపోవాలి సార్’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఎలాంటి సంకోచం లేకుండా యువకుడు వ్యవసాయంపై తన అభిప్రాయం వ్యక్తం చేయడంతో సీఎంతో సహా అక్కడ ఉన్నవారంతా ఒకేసారి నవ్వేశారు.

యువకుడి సమయస్ఫూర్తిని మెచ్చుకున్న సీఎం చంద్రబాబు.. వ్యవసాయం చేయడం మంచిదే కానీ, చదువును మాత్రం ఆపొద్దని సూచించారు. యువకుడి భుజాన్ని తట్టి అతడి మాటతీరును అభినందించారు. ఇక ఆ తర్వాత స్థానిక పరిస్థితులపై అక్కడున్న వారిని సీఎం వాకబు చేశారు. తుఫాన్‌ బాధితులను ఆదుకోవడానికే తాను వచ్చానని సీఎం స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మిమ్మల్ని పలుకరించి ధైర్యం చెప్పాలని వచ్చానంటూ బాధితులకు భరోసా ఇచ్చారు సీఎం.

కాగా, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు తక్షణ సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాను సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ప్రత్యేక సాయం అందజేయాలని సూచించారు. అదేవిధంగా సహాయ, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రతి వ్యక్తికీ రూ.1,000 చొప్పున అందజేయాలని, గరిష్టంగా ఒక కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు డ్రా చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News