ఏపీలో 'గుజ‌రాత్ మోడ‌ల్'.. విమ‌ర్శ‌ల‌కు చెక్ ఇదే!

తాజాగా విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చడానికి ప్ర‌య‌త్నిస్తున్న సీఎం చంద్ర‌బాబు `టిసిఎస్` వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌కు భూములు కేటాయించారు.;

Update: 2025-04-17 19:30 GMT

త‌ర‌చుగా ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గుజ‌రాత్ మోడ‌ల్‌ను మెచ్చుకుంటున్నారు. కేవ‌లం రాజ‌కీయాల‌నే కాదు.. పాల‌న‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావిస్తున్నారు. అక్క‌డ బీజేపీ వ‌రుస‌గా విజ‌యాలు ద‌క్కించుకుని.. అధికారం నిల‌బెట్టుకుంటోంది. దీనిని ప్ర‌స్తావిస్తున్న చంద్ర‌బాబు ఏపీలోనూ అదే త‌ర‌హా వ‌రుస విజ‌యా లు ద‌క్కించుకుంటే.. వ‌చ్చే 20 ఏళ్ల‌లో రాష్ట్రం దేశానికే త‌ల‌మానికంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే గుజ‌రాత్ త‌ర‌హా పాల‌న‌ను కూడా ఆయ‌న అనుస‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

తాజాగా విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చడానికి ప్ర‌య‌త్నిస్తున్న సీఎం చంద్ర‌బాబు `టిసిఎస్` వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌కు భూములు కేటాయించారు. టీసీఎస్ రాక‌తో ఐటీ రంగానికి.. ఏపీకి కూడా గేమ్ ఛేంజర్ కాబోతోంద‌ని సీఎం భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు గ‌తంలోనే సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిం చారు. అయితే.. వైసీపీ రాక‌తో వ‌చ్చిన కంపెనీలు కూడా వెన‌క్కి పోయాయి.

ఇప్పుడు అతి క‌ష్టం మీద ప‌లు సంస్థ‌లను ఏపీకి తీసుకువ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీసీఎస్‌కు ఐటి హిల్స్ లో 26.1 ఎక‌రాల భూమిని కేటాయించారు. అయితే.. ఈ కేటాయింపుల‌పై ఒకింత విమ‌ర్శ‌లు వ‌చ్చా యి. ఎక‌రాను రూ.0.99 పైస‌ల‌కు కేటాయించ‌డ‌మేంట‌ని మేధావుల నుంచి కూడా నిల‌దీత‌లు ఎదుర‌వుతు న్నాయి. టీసీఎస్ అనేది పెద్ద సంస్థ అని.. కాబ‌ట్టి.. పైస‌ల‌కు భూములు కేటాయించ‌డ‌మేంట‌న్న‌ది ప్ర‌శ్న‌. దీనిపై ఒకింత లోతుగా ఆలోచిస్తే.. త‌త్వం బోధ‌ప‌డుతుంది.

బడా సంస్థలను ఆకర్షించేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రభుత్వాల వ్యూహంలో భాగం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో గుజరాత్ సీఎంగా పనిచేసే సమయంలో టాటా మోటార్స్‌ను గుజరాత్‌లోని సనంద్ జిల్లాకు తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో ఆ సంస్థ‌కు కూడా.. ఎక‌రాకు రూ.0.99 పైసలకు భూమిని కేటాయించారు. ఇది గుజరాత్‌లోని ఆటో పరిశ్రమకు ఒక మైలురాయిగా నిలచింది. ఈ మోడ‌ల్‌ను గ‌మ‌నించిన సీఎం చంద్ర‌బాబు.. ఇత‌ర రాష్ట్రాలు పోటీ ప‌డ‌కుండా ఉండేందుకు.. నామ‌మాత్ర‌పు రేటుకే కేటాయించారు. త‌ద్వారా సంస్థ త్వ‌ర‌గా ఏర్పాటు చేసేందుకు.. ఉద్యోగ క‌ల్ప‌న‌కు కూడా ఇది దోహ‌ద‌ప‌డ‌నుంది. అయితే.. ఈ విష‌యాన్ని అర్థం చేసుకోని కొంద‌రు విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు.

Tags:    

Similar News