చంద్రబాబు దాహం తీరలేదా? రూ.10 లక్షల కోట్లు సరిపోలేదా?
ఏపీని పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడపాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు తీసుకువచ్చిన పెట్టుబడులు సరిపోవని భావిస్తున్నారు;
ఏపీని పారిశ్రామికంగా ప్రగతి పథంలో నడపాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు తీసుకువచ్చిన పెట్టుబడులు సరిపోవని భావిస్తున్నారు. రాష్ట్రంలో పుష్కలమైన వనరులు ఉన్నాయని చెబుతూ మరిన్ని పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. తనతోపాటు మిగిలిన మంత్రులను ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు చేస్తూ రాష్ట్రాభివృద్ధిపై తగ్గేదేలె అన్న సంకేతాలు పంపుతున్నారు. వచ్చే నెలలో విశాఖలో నిర్వహించే సీఐఐ గ్లోబల్ సమ్మిట్ కు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం.. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. అదే సమయంలో చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేశ్ ఎయిర్ బస్ కంపెనీ ప్రతినిధులను కలిశారు. మరోవైపు పెట్టుబడుల సదస్సుకు దక్షిణ కొరియా కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించేందుకు వెళ్లిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ ఆ దేశంలో పలు కంపెనీల ప్రతినిధులను కలుస్తున్నారు.
ఇటు చంద్రబాబు, అటు మంత్రులు నవంబర్ నవంబర్ 14 , 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే ‘CII భాగస్వామ్య సదస్సు’ను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి సాధించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే అవకాశాలను అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు వివరించి, పెట్టుబడులకు రాష్ట్రం ఒక అద్భుతమైన గమ్యస్థానంగా తెలియజేసేలా పావులు కదుపుతున్నారు. తమ ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీలో పర్యటించగా, మరో బృందంలో సభ్యులైన మంత్రులు నారాయణ, బీసీ జనార్దనరెడ్డి దక్షిణ కొరియాలో కొన్ని రోజులుగా పర్యటిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలలో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడుదల ద్వారా దాదాపు 9 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు క్షేత్రస్థాయిలో పనిచేయడం ఎప్పుడు ప్రారంభిస్తాయో కానీ, ప్రస్తుతానికైతే రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యాయని అంటున్నారు. ప్రజలు సైతం పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు తమ కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభిస్తాయా? అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు.
అయితే ఈ పెట్టుబడులు గ్రౌండింగ్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం సరైన రీతిలో పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చినట్లు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన దాహం తీరలేదని చాటుకోడానికి ఇంకా కొత్తగా మరిన్ని పెట్టుబడులు సాధిస్తామని చెబుతున్నారు. ఇందుకోసం విశాఖలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహించనున్న సీఐఐ సదస్సును ఓ అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఆలోచనను ఎవరూ వ్యతిరేకించకపోయినప్పటికీ, ఇప్పటివరకు తెచ్చామని చెబుతున్న పెట్టుబడులలో 90 శాతం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు.
రూ.10 లక్షల కోట్లలో కనీసం పది పరిశ్రమలు అయినా ప్రారంభానికి నోచుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎంతో కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. అయితే 16 నెలలుగా రాష్ట్రానికి వరదలా వస్తున్న పెట్టుబడుల్లో ఎన్ని వాస్తవ రూపు దాల్చుతున్నాయి? వాటిని వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేలా చొరవ తీసుకునే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై క్లారిటీ ఉండటం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పెట్టుబడులు అంటూ పారిశ్రామక వేత్తల చుట్టూ పరిగెడుతుంటే.. ఇక్కడ రాష్ట్రంలో అందుకు తగినట్లుగా ఆ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూసే బాధ్యతను వేరొకరికి అప్పగిస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో పెట్టుబడులు పేపర్లకే పరిమితమై చంద్రబాబు కష్టం విమర్శల పాలయ్యే అవకాశాలే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.