గ్రాండ్ గా సెలబ్రేషన్స్ కి రెడీ అయిన బాబు!
చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఇది నాలుగోసారి. తెలుగునాట ఆయన మాదిరి ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయిన వారు ఎవరూ లేరు.;
చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఇది నాలుగోసారి. తెలుగునాట ఆయన మాదిరి ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయిన వారు ఎవరూ లేరు. దాంతో పాటు తెలుగుదేశం కూటమి అధ్బుతమైన సక్సెస్ రేటుని సాధించింది. ఈ రోజున బాబుకు రాజకీయంగా ఉన్న అనుకూల పరిస్థితి ఎవరికీ లేదు. అటు నరేంద్ర మోడీ అందిస్తున్న సహకారంతో పాటు ఇటు ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపిస్తున్న అభిమానం ఇవన్నీ కూడా బాబుకు అందివచ్చిన అవకాశాలు.
మరో వైపు చూస్తే కలసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకుగా నారా లోకేష్ చంద్రబాబుకు పుత్రోత్సాహం కలిగిస్తున్నారు. లోకేష్ తండ్రి బాటలోనే నడుస్తూ ఆయనకు ఆనందం రెట్టింపు చేస్తున్నారు. రాజకీయంగా బాబుకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా భారాన్ని సగానికి పైగా లోకేష్ మోస్తున్నారు.
ఇది కూడా బాబుకు చాలా ఊరటను ఇస్తున్న విషయం. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాను అనుకున్న విధంగా ఏడాది పాలన పూర్తి చేశారు. ఆయన అమరావతి రాజధాని విషయంలో పరుగులు పెట్టించేందుకు చూస్తున్నారు. అలాగే పోలవరం విషయంలో కూడా ఒక లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారు. అంతే కాదు అభివృద్ధితో పాటుగా సంక్షేమానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇలా తొలి ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సకెస్ ఫుల్ గా బాబు పాలించారు. దాంతో మొదటి ఏడాదిని సుపరిపాలనలో తొలి అడుగు అన్న పేరుతో ఈ నెల 23న ఘనంగా జరపబోతున్నారు. నిజానికి చూస్తే ఈ నెల 12న ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే అహమదాబాద్ లో జరిగిన భారీ విమాన ప్రమాదం కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
దీంతో అమరావతిలోని సచివాలయం వెనక ఉన్న విశాలమైన మైదానంలో ఈ కార్యక్రమంలో తొలి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మొత్తం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏడాది పాటు ఏపీలో అమలు చేసిన కార్యక్రమాల గురించి చంద్రబాబు ప్రజలకు వివరిస్తారు అని అంటున్నారు.
అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అని అంటున్నారు. ఏడాదిలో ఎనభై శాతం హామీలు నెరవేర్చినట్లుగా కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అలాగే అభివృద్ధిలో పరుగులు పెట్టించామని పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని కూడా పేర్కొన్నారు. వాటిని అన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివర్చించే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక చంద్రబాబు నాయకత్వంలోని కూటమి వన్ ఇయర్ సక్సెస్ పాలన మీద అంగరంగ వైభవంగానే కార్యక్రమం జరుపుతారని అంటున్నారు.