బంగ్లా తాజాగా తగలబడటానికి కారణం ఇదే.. ఎవరీ హైదీ..!
ఈ క్రమంలో గత వారం ఢాకాలోని ఒక మసీదు నుంచి బయటకు వస్తోన్న సమయంలో ముసుగులు ధరించిన దుండగులు కాల్పు జరిపారు. దీంతో అతడిని హుటాహుటున స్థానిక ఆస్పత్రికి తరలించారు.;
గత కొన్ని రోజులుగా భారత వ్యతిరేక వాక్ చాతుర్యాన్ని మరింతగా పెంచి మాట్లాడుతున్న బంగ్లాదేశ్ లోని అనేక నగరాలు రాత్రికి రాత్రే హింసాత్మకంగా మారిపొయాయి. అనేక ప్రాంతాల్లో చెలరేగిన ఈ హింసను నివారించడానికి అదనపు పోలీసు, పారామిలటరీ దళాలను మొహరించారు. ఈ నేపథ్యంలో ఉన్నపలంగా ఈ స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగడానికి కారణం షరీఫ్ ఉస్మాన్ హైదీ మరణం.
అవును... రాడికల్ నాయకుడు, బంగ్లాదేశ్ లో 2024లో జరిగిన విద్యార్థి తిరుగుబాటు సమయంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న షరీఫ్ ఉస్మాన్ హైది మరణం తర్వాత బంగ్లాదేశ్ రాత్రికి రాత్రే తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. గత శుక్రవారం ఢాకాలో హైదీని ముసుగు ధరించిన దుండగులు తలపై కాల్చగా.. చికిత్సపొందుతూ అతడు మరణించాడు. దీంతో ఒక్కసారిగా బంగ్లా తగలబడిపోతోంది.
ఎవరీ హైదీ!:
విద్యార్థి నిరసన సంస్థ ఇంకిలాబ్ మంచాకు నాయకుడు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ప్రకటించిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థి.. ప్రధానంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను పదవీచ్యుతుని చేసిన జూలై 2024 తిరుగుబాటులో కీలక భూమిక పోషించిన వ్యక్తి ఈ షరీఫ్ ఉస్మాన్ హైదీ. ఇతడు సెంట్రల్ ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు.
ఈ క్రమంలో గత వారం ఢాకాలోని ఒక మసీదు నుంచి బయటకు వస్తోన్న సమయంలో ముసుగులు ధరించిన దుండగులు కాల్పు జరిపారు. దీంతో అతడిని హుటాహుటున స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఇతని ఆరోగ్యాన్ని గమనించిన ఢాకాలోని వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీంతో.. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అతన్ని ఎయిర్ అంబులెన్స్ లో సింగపూర్ కు పంపింది.
ఈ క్రమంలో సోమవారం నుంచి అక్కడ చికిత్స పొందుతున్న హైదీ.. గురువారం మరణించాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి జాతినుద్దేశించి టెలివిజన్ లో ప్రసంగించిన ప్రధాన సలహాదారు యూనస్.. జూలై తిరుగుబాటులో నిర్భయమైన ఫ్రంట్ లైన్ పోరాట యోధుడు, ఇంకిలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైదీ ఇక మన మధ్య లేరు అంటూ అతని మరణాన్ని ధృవీకరించారు.
ఆ మరణ ప్రకటన వచ్చిన కాసేపటికే.. ఢాకా యూనివర్సిటీ ప్రాంగణంలోని రాజధాని షాబాగ్ కూడలి వద్ద వందలాది మంది విద్యార్థులు, ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా.. నువ్వు ఎవరు, నేను ఎవరు.. హైదీ హైదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్.. ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించారు.
తగలబడుతున్న బంగ్లాదేశ్!:
ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి బంగ్లాదేశ్ తగలబడటం మొదలైంది! ఇందులో భాగంగా.. ఆ దేశంలోని డెయిలీ స్టార్ పత్రికా కార్యాలయంపై అల్లరిమూకలు దాడి చేశాయి. ఈ సందర్భంగా ఆ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఇదే సమయంలో.. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయంపై కూడా అల్లరి మూకలు దాడులు చేశాయి. దీంతో ఈ ప్రధాన పత్రికలు నేడు కార్యకాలాపలు నిలిపేశాయి!
మరోవైపు బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రహమాన్ కుటుంబానికి ధన్ మోండీ 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వాస్తవానికి ఈ ఇంటిని ప్రస్తుతం మ్యూజియంగా వాడుతున్నారు.