జగన్ కంటే విశాఖ మీద ప్రేమ ఆయనకేనా ?

అయితే 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019లో తాను ఎందుకు ఓటమి పాలు అయ్యానో తప్పులు తెలుసుకున్నారు అని అంటారు.;

Update: 2025-09-17 09:30 GMT

విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని ఆనాటి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాను విశాఖ నుంచి పాలన చేయాలనుకుంటే సీఎం ఆఫీస్ కోసం మంచి భవనం అని రుషికొండ మీద అద్భుతమైన పాలెస్ కట్టించారు అని కూడా ప్రత్యర్ధులు అంటారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అది ఆయన అధికార నివాసం కోసం అని ఎక్కువగా వినిపించేది. జగన్ ప్యాలెస్ అని విపక్షాలు ఆనాడు రచ్చ చేసేవి. కట్ చేస్తే జగన్ విశాఖకు సీఎం హోదాలో పెద్దగా వచ్చింది లేదు, పైగా ఎంతో బాగా తాము కట్టామని వైసీపీ నేతలు పదే పదే చెప్పుకునే రుషికొండ ప్యాలెస్ ని సైతం జగన్ సందర్శించలేదు తన కాలు కూడా అక్కడ పెట్టకుండానే ఆయన మాజీ సీఎం అయిపోయారు.

ఫోకస్ పెంచిన బాబు :

అయితే 2024 ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019లో తాను ఎందుకు ఓటమి పాలు అయ్యానో తప్పులు తెలుసుకున్నారు అని అంటారు. ప్రాంతీయ అభివృద్ధి విషయంలో విపక్షంగా వైసీపీ చేసిన విమర్శలను ఆయన దృష్టిలో ఉంచుకుని ఇపుడు వాటి మీదనే ఫోకస్ పెడుతున్నారు. అటు రాయలసీమను ఇటు విశాఖ సహా ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు రాయలసీమ జిల్లాలలో టూర్లు ఎక్కువగా చేస్తున్నారు అలాగే ఉత్తరాంధ్రాలో సైతం ఆయన తన అధికార పర్యటనలు అధికం చేస్తున్నారు.

పేరు చెప్పకుండానే :

జగన్ మాదిరిగా చంద్రబాబు విశాఖను రాజధాని అనలేదు. విశాఖ నుంచే పాలిస్తామని కూడా చెప్పలేదు. కానీ ఆయన విశాఖలోనే ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. ఒక విధంగా విశాఖ నుంచే పాలిస్తున్నారు అని చెప్పాల్సి ఉంది. కీలకమైన సదస్సులు అన్నీ విశాఖలోనే పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాలుగైదు సార్లు విశాఖ వచ్చారు అంటే ఆయన ఈ నగరానికి ఇస్తున్న ప్రయారిటీ అంతా ఇంతా కాదు, సీఎం మా సిటీలోనే ఉన్నారు అన్నది వైజాగ్ వాసులు హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పుకునే విషయంగా ఉంది. అంతే కాదు నవంబర్ నెలలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ని కూడా చంద్రబాబు విశాఖ వేదికగా ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ కి దేశ విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. అలాగే రాష్ట్ర కేంద్ర మంత్రులు కీలక నేతలు అంతా హాజరవుతున్నారు.

ప్రేమ అంటే ఇదే :

విశాఖ మా గుండెలలో ఉంటుంది అని గత నెలలో విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ అన్న మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశాఖ ఎపుడూ టీడీపీని ఆదరిస్తూ వచ్చింది. కంచుకోటగా నిలిపింది. 2019 ఎన్నికల్లో సైతం విశాఖ టీడీపీని కాచుకుంది అని లోకేష్ చెప్పారు. టీడీపీ అధినాయకత్వం అలాగే భావిస్తోంది. అంతే కాదు వైసీపీ రాజధాని అన్నా కూడా ఆ వైపు చూడకుండా టీడీపీకే ఓటేసింది. అలా టీడీపీనే గట్టిగా నమ్మింది. దాంతో ఆ అభిమానంతో విశాఖ సహా ఉత్తరాంధ్రకు ఎంతో చేయాలని టీడీపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు.

అమరావతి ఏపీకి రాజధాని అయినా దానితో సమానంగా విశాఖను అలాగే తిరుపతి కర్నూల్ లను అభివృద్ధి చేస్తామని సమగ్రమైన అభివృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేక సార్లు చెప్పారు. దాంతో మరోసారి ప్రాంతే అసమానతలు అని ఎవరూ మాటెత్తకుండా వైసీపీకి ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు త్రివిక్రముడు అవతారంలో మూడు ప్రాంతాల మీద తన కాలు మొపుతూ ఉత్తరాంధ్రా మధ్యాంధ్ర రాయలసీమ అన్నిటా తన ముద్ర బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. దాంతో విశాఖ అంటే నోటి మాటలతో ప్రేమ కాదు అభివృద్ధి చేస్తూ తరచూ సిటీలో అధికార కార్యక్రమాలు నిర్వహిస్తూ బాబు చూపిస్తున్నదే అసలైన ప్రేమ అని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News