సీనియర్లకు గోల్డెన్ డేస్...బాబు గుడ్ న్యూస్ !

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. వారు ఎంతో అనుభవం పాలనా పరంగానూ రాజకీయంగానూ కలిగిన వారు.

Update: 2026-05-22 04:30 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కొదవ లేదు. వారు ఎంతో అనుభవం పాలనా పరంగానూ రాజకీయంగానూ కలిగిన వారు. దశాబ్దాలుగా అన్ని విధాలుగా నలిగిన వారు. టీడీపీ ప్రభుత్వం అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చే మంత్రుల పేర్లు చాలా ఉన్నాయి. కానీ విచిత్రంగా 2024 లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో అన్నీ కొత్త ముఖాలే కనిపించాయి. ఒక విధంగా యువతకు అవకాశాలు ఇవ్వాలని పార్టీ ప్రయోగం చేసింది. అయితే రెండేళ్ళ పాలన తరువాత చూస్తే ఆశించిన ఫలితాలు అయితే రావడం లేదని గ్రహించారు అని అంటున్నారు. చాలా మంది తొలిసారి గెలిచినా కూడా జాక్ పాట్ తగిలి మంత్రులు అయిపోయారు. కానీ వారు శాఖల మీద పట్టు సాధించే ప్రయత్నంలోనే ఇంకా ఉన్నారు అన్న ప్రచారం ఉంది.

దూకుడు లేదని :

ఇక చూస్తే విపక్ష వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయినా కూడా రాజకీయంగా కూటమిని ఇరకాటంలో పెడుతోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు మీడియా ముఖ్యంగా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రతీ అంశం మీద కూటమి ప్రభుత్వానికి ముడి పెడుతూ ఇరకాటంలో పెడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలు కారణం అన్నది తెలిసిందే. ప్రపంచం మొత్తం మీద ఇంధన ధరలు పెరిగాయి. కానీ ఒక్క ఏపీలోనే పెంచినట్లుగా వైసీపీ నిరసనలు చేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీని మీద ప్రభుత్వం నుంచి సరైన కౌంటర్లు పడలేదన్న చర్చ ఉంది. ఇదొక్కటే కాదు ఆర్టీసీ బస్సులు తీసేస్తారు అని కార్మికులను బయట పడేస్తారు అని ఉచిత బస్సు పధకానికి మంగళం పాడేస్తారు అని ప్రత్యర్థి పార్టీ విమర్శలు చేస్తోంది. దానికి ధీటైన జవాబు అయితే కరవు అవుతోంది అని అంటున్నారు. ఇలా అనేక అంశాల మీద మంత్రుల స్థాయిలో విపక్షాన్ని కట్టడి చేయలేకపోతున్నారు అని అంటున్నారు.

కూటమిలో పెద్ద పోరు :

ఇక ప్రతీ జిల్లాలో అలాగే నియోజకవర్గాల స్థాయిలో కూటమి పార్టీల మధ్య వర్గ పోరు సాగుతోంది. అది పీక్స్ కి చేరుతున్న సందర్భాలు సైతం ఉన్నాయి. కొత్త వారు అయినా అనేక మంది మంత్రులకు జిల్లాల ఇంచార్జిల బాధ్యతలు అప్పగించారు. వారు ఆయా జిల్లాలలో కూటమి పార్టీలను ఒక్కటిగా చేయడంతో పాటు వర్గ పోరుకు ఫుల్ స్టాప్ పెట్టించాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగడం లేదని అంటున్నారు. అనుభవం లేకపోవడం వల్ల అలాగే కొంతమంది ఒక వర్గానికే అనుకూలంగా వ్యవహరించడం వల్ల మరి కొందరు అయితే పట్టించుకోకపోవడం వల్ల జిల్లాలలో కూటమి ఐక్యత అయితే దెబ్బ తింటోంది అని అంటున్నారు. ఇది రాజకీయంగా ఇబ్బందులను తెచ్చి పెట్టేలా ఉందని అంటున్నారు.

సీనియర్లతోనే ముందుకు :

ఈ నేపధ్యంలో అన్ని విధాలుగా అనుభవం కలిగిన సీనియర్ నేతలతోనే ముందుకు సాగాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారని అంటున్నారు. సీనియర్లకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటుందని వారికి జిల్లాల బాధ్యతలు అప్పగించినా సక్రమంగా చేసుకుని రాగలరు అన్నది కూడా ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే సీనియర్ నేతలు లేని కొరత కూడా కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది అని అంటున్నారు. దాంతో మంత్రి వర్గ విస్తరణ ఎపుడు జరిపినా ఈసారి సీనియర్లకు పెద్ద పీట వేయడం ఖాయమని అంటున్నారు. దాంతో సీనియర్లలో ఉత్సాహం కట్టలు తెంచుకుంటోంది. గోల్డెన్ డేస్ తనకు తిరిగి రానున్నాయని బాబు తనకు గుడ్ న్యూస్ చెబుతారు అని వారంతా ఫుల్ జోష్ లో ఉన్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News