ఉద్యోగులకు దీపావళి వరమిచ్చిన బాబు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు గత పదహారు నెలలుగా ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారు. వారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుని వెళ్తున్నారు.;
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు గత పదహారు నెలలుగా ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారు. వారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుని వెళ్తున్నారు. ప్రభుత్వం లక్ష్యాలను అర్ధం చేసుకుని దానికి అనుగుణంగా పనిచేస్తున్నారు. అవసరమైతే సెలవు రోజులలో కూడా అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పాజిటివ్ గా ఉందని సంకేతాలు ఇస్తోంది. వారికి ప్రతీ నెలా ఒకటవ తేదీన జీతాలు ఇస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా డిమాండ్లు ఉన్నాయి. దాని మీద ఉద్యోగ సంఘాల నేతలు అనేక వేదికల మీద ప్రస్తావించారు. తరచూ మీడియా ముందుకు వచ్చి మరీ తమ బాధ చెబుతున్నారు.
సానుకూలమేనా :
ఇక ప్రభుత్వం అయితే ఉద్యోగుల విషయంలో తాము సానుకూలమే అని చెబుతోంది. మంత్రి వర్గ ఉపసంఘంతో సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాల నేతలు శనివారం చర్చించారు. అనంతరం ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దృష్టిలోకి తీసుకుని వెళ్లారు. ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగులో ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని కోరుతున్నారు. అంతే కాకుండా తమకు కొత్త పీఆర్సీ కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈలోగా ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. దాని మీద మంత్రుల బృందం సీఎం చంద్రబాబుకు నివేదించింది.
ఒక డీఏ మంజూరు :
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సంఘం నేతల సమస్యలను మంత్రివర్గ ఉప సంఘం తో సమావేశం అయి వారి సావధానంగా విన్నారు అని చెబుతున్నారు. మొత్తానికి సానుకూలంగా ఆయన స్పందించారు అని అంటున్నారు. ఉద్యోగులకు ఒక డీఏను దీపావళి కానుకగా చంద్రబాబు ప్రకటించారు. దీని వల్ల ప్రభుత్వానికి 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. అయినా సరే ఉద్యోగుల కోసం ఈ ఖర్చుని భరిస్తూ డీఏ ప్రకటిస్తున్నామని చెప్పారు. రానున్న రోజులలో మరిన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
వెలుగులు దక్కినట్లేనా :
ఇదిలా ఉంటే నాలుగు డీఏలు పెండింగులో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అందులో ఒకటి ఇవ్వడం మంచిదే కానీ మిగిలినవి కూడా తొందరగా ఇవ్వాలని కోరుతున్నారు. అంతే కాదు ఉద్యోగులకు కొత్త పీఆర్సీని ప్రకటించాలని అంటున్నారు. సాధ్యమైనంత తొందరగా కమిషన్ ని వేయాలని వారు అంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం దీపావళి కి ఒక తీపి కబురు వినిపించడం పట్ల ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు.