‘అసెంబ్లీకి రాకుండా పబ్జీలు ఆడుకుంటున్నారు’ - సీఎం చంద్రబాబు ఫైర్
విపక్షం వైసీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా డీఎస్సీపై ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు వైసీపీ సభ్యులకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.
విపక్షం వైసీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా డీఎస్సీపై ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు వైసీపీ సభ్యులకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. ‘‘ అసెంబ్లీకి వస్తే అడ్డంగా దొరికిపోతారనే వాళ్లు రావటం లేదు. రోడ్డుపై హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారు.’’ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి చెబుతున్నాను అంటూ భరోసా ఇచ్చారు. పూర్తి పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనంతో నియామకాలు జరియని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డీఎస్సీపై అసెంబ్లీకి రాకుండా వైసీపీ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. సభలో డీఎస్సీపై చర్చ సందర్భంగా ముందు మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తన హయాంలో విద్యారంగ అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు.
ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని వైసీపీ తమ హయాంలో చేపట్టిన మెగా డీఎస్సీపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 14 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తే అందులో 11 డీఎస్సీలు తాను ముఖ్యమంత్రిగా ఉండగా నోటిఫికేషన్ ఇచ్చినవేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ను కూడా నియమించకుండానే విద్యారంగంలో సంస్కరణలు చేపట్టినట్లు వైసీపీ ప్రచారం చేసుకోడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు చోటు ఉండదని, ఎవరైనా తప్పుచేస్తే వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.
మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గడచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణలతో మార్పులు తెచ్చామని, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్య సంస్థల సహా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ‘‘మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం, కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియామకాలు పూర్తి చేశాం’’ అంటూ వివరించారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత శ్రద్ధగా చేపట్టామని వెల్లడించారు. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నల్ని ఎంపిక చేసి అత్యుత్తమ విధానంలో పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు.
సీబీటీ విధానంలో 154 సెంటర్లలో పరీక్షలు నిర్వహించామని, ప్రతిభ ఆధారంగా 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టామని వివరించారు. జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించామని, స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల్నే అమలు చేశామని తెలిపారు. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారని కితాబునిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని వారంతా చెప్పారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే ఉంది. ఇంతకంటే పారదర్శకత ఎక్కడ ఉంటుందని వివరించారు.
ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఎఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఒక్క డీవియేషన్ కూడా లేదు. లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు 3 వందలకు పైగా కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. వారు చేసిన ఆరోపణలపై అధికారులు పూర్తి అధికారిక సమాచారంతో వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణల్ని ఇక సహించలేక ఇప్పుడు డీఎస్సీ టీచర్లే రోడ్డుపైకి వచ్చారు. కర్నూలులో, నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అంటూ సీఎం వివరించారు. ఒడిశా కూలీలతో , 90 ఏళ్ల జగన్ జెన్ జీ వ్యక్తులతో ఆందోళనల్ని చేయించారని విమర్శించారు.
తన ప్రభుత్వంలో ప్రజలకు జవాబుదారీగా వహిస్తామని, కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదని స్పష్టం చేశారు. విద్యావిధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శకత తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బురద జల్లితే అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ‘‘సిగ్గులేని ఆ పార్టీ అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చేయాలి. రెండున్నర ఏళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం నా జీవితంలో ఇదే తొలిసారి. అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు అంటూ సీఎం చంద్రబాబు వైసీపీ సభ్యులపై మండిపడ్డారు.