చంద్రబాబు కాన్వాయ్ పై ఇంట్రస్టింగ్ పాయింట్.. నాలుగేళ్లగా ఇన్సూరెన్స్ చెల్లించలేదా?

ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ లోని రెండు అంబులెన్సులకు ఇన్సూరెన్స్ చెల్లించని విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-10-10 09:05 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ లోని రెండు అంబులెన్సులకు ఇన్సూరెన్స్ చెల్లించని విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లుగా క్లరికల్ ఉద్యోగుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. జగన్ హయాం నుంచి ఇన్సూరెన్స్ బకాయిలు ఉండగా, తాజాగా ఆర్టీవో అధికారులు గుర్తించి ఇన్సూరెన్స్ చేయించాలని లేఖ రాయడంతో ఈ అంశం వెలుగు చూసింది. పాత ఫైళ్లు క్లియర్ చేయకపోవడంతో కొత్తగా విధుల్లో చేరాల్సిన ఓ సీనియర్ అసిస్టెంట్ తన బాధ్యతలు తీసుకోడానికి నిరాకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ లో రెండు అంబులెన్స్ లు ఉంటాయి. ఇందులో ఒకటి చంద్రబాబు కాన్వాయ్ ఎటువెళితే అటు ఫాలో అవుతుంటుంటుంది. మరొకటి అత్యావసర సమయాల్లో ప్రత్యామ్నాయంగా వాడటానికి ఉద్దేశించినది. ఈ రెండు కూడా విజయవాడ జీజీహెచ్ పరిధిలో ఉంటాయి. అయితే ఈ అంబులెన్స్ లకు గతంలో పనిచేసిన వెహికల్ సీనియర్ అసిస్టెంట్ ఇన్సూరెన్స్ చెల్లించలేదని తెలిసింది. ఇలా నాలుగేళ్లు గడిచిపోవడంతో మొత్తం రెండు వాహనాలకు సుమారు రూ.2.81 లక్షల బకాయి ఉన్నట్లు ఆర్టీవో అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని వాహనాలకు ఇన్సూరెన్స్ తోపాటు పొల్యూషన్, ఇతర పత్రాలు కూడా చేయించలేదని చెబుతున్నారు. దీనిపై గతంలో పనిచేసిన గుమస్తాను అధికారులు ప్రశ్నిస్తే అంబులెన్సులకు సంబంధించిన సీబుక్స్ ఎక్కడో మిస్ అయ్యాయని అందుకే ఇన్సూరెన్స్ చేయించలేకపోయినట్లు చెబుతున్నారని అంటున్నారు. అయితే ఈ రికార్డుల విషయంలో తప్పులను గుర్తించిన సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో కొత్తగా వచ్చిన ఉద్యోగి విధుల్లో చేరేందుకు నిరాకరించినట్లు చెబుతున్నారు.

రికార్డుల విషయంలో గతంలో పనిచేసిన ఉద్యోగి నిర్లక్ష్యం వల్లే ఇన్సూరెన్స్ చేయలేకపోయామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంటును మరోసారి వివరణ కోరతామని, రికార్డులు తీసుకుని ఇన్సూరెన్స్ బకాయిలు క్లియర్ చేస్తామని అధికారులు చెప్పినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.

Tags:    

Similar News