జెన్ జెడ్ స్ఫూర్తితో 'అజాద్ హింద్'.. నేతాజీ మనవడి కొత్త పార్టీ.. దేశంలో సంచలనం
కొత్తగా రాబోతున్న 'ఆజాద్ హింద్ పార్టీ'కి ప్రగతిశీల, సమగ్ర లౌకిక భావజాలం కలిగిన యువతను ప్రధాన బలంగా మార్చాలని చంద్ర కుమార్ బోస్ భావిస్తున్నారు.
భారత రాజకీయాల్లో మహానాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేతాజీ కుటుంబానికి చెందిన చంద్ర కుమార్ బోస్ త్వరలోనే 'ఆజాద్ హింద్ పార్టీ' పేరుతో ఒక నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ.. సమాజంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై యువతలో రేకెత్తుతున్న తీవ్ర అసంతృప్తికి ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని అందించాలనే సంకల్పంతోనే ఈ కొత్త పార్టీని తీర్చిదిద్దుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ సరికొత్త రాజకీయ ప్రయాణానికి ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చోటుచేసుకున్న జెన్-జెడ్ యువత నిరసనలే తనకు ప్రధాన స్ఫూర్తినిచ్చాయని చంద్ర కుమార్ బోస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాలలో అవినీతి ఒక భాగమైపోయిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. వర్తమాన ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థల పనితీరుపై తీవ్ర నిరాశతో ఉన్న దేశ యువతకు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడేందుకు ఒక ప్రత్యేకమైన రాజకీయ వేదిక అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే ఆనాడు నేతాజీ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' స్ఫూర్తితోనే నేడు ఈ నూతన పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు.
చంద్ర కుమార్ బోస్ రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే ఇది ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో కూడుకుని ఉంది. 2016లో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. సుమారు ఏడేళ్ల పాటు బీజేపీలో కొనసాగిన సమయంలో నేతాజీ భావజాల వ్యాప్తి కోసం 'ఆజాద్ హింద్ మోర్చా' ఏర్పాటు చేస్తామని పార్టీ నాయకత్వం తనకు హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ మోర్చాకు తానే నాయకత్వం వహిస్తానని భావించినప్పటికీ సంవత్సరాలు గడిచినా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో తీవ్ర అసంతృప్తితో 2023లో బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేతాజీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు టీఎంసీ తనకు సరైన అవకాశం కల్పిస్తుందని అప్పట్లో భావించినప్పటికీ అక్కడ కూడా ఆయన ప్రయాణం ఎక్కువ కాలం కొనసాగలేదు. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి.. ఇప్పుడు స్వతంత్రంగా సొంత రాజకీయ వేదికను నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
కొత్తగా రాబోతున్న 'ఆజాద్ హింద్ పార్టీ'కి ప్రగతిశీల, సమగ్ర లౌకిక భావజాలం కలిగిన యువతను ప్రధాన బలంగా మార్చాలని చంద్ర కుమార్ బోస్ భావిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజకీయ ఆలోచనల్లోని ఆదర్శవంతమైన జాతీయవాదం, దేశ సమగ్రత, మత సామరస్యం, క్రమశిక్షణ, నవభారత నిర్మాణం వంటి ముఖ్యమైన అంశాలను ఈ రాజకీయ వేదిక ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. సోషల్ మీడియా, యువత ఉద్యమాల ఆధారంగా ప్రస్తుత వ్యవస్థపై యువతలో ఉన్న ఆక్రోశాన్ని ఒక రాజకీయ శక్తిగా మలచాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే నేతాజీ పేరు, ఆయన గొప్ప వారసత్వం మాత్రమే ఒక రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి విజయాన్ని అందిస్తుందా అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రధాన ప్రశ్న. బీజేపీ, టీఎంసీ వంటి పెద్ద పార్టీలలో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఒక సొంత రాజకీయ పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మించడం చంద్ర కుమార్ బోస్‌కు అంత సులువైన సవాలు కాదు. పార్టీకి అవసరమైన బలమైన క్యాడర్, ప్రాంతీయ నాయకత్వం, ఆర్థిక వనరులు, సమర్థవంతమైన ప్రచార వ్యూహాలతో పాటు యువతకు ఉపాధి, పారదర్శక పాలనపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించాల్సి ఉంటుంది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా యువత అసంతృప్తిని ఓట్లుగా మార్చుకుని 'ఆజాద్ హింద్ పార్టీ' కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతుందో లేక కేవలం ఒక రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.