ఏపీలో మూడవ ఫ్రంట్....ఏబీ ప్లాన్ ఏంటి ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ దాకా సమయం ఉంది. కానీ ఏపీలో రాజకీయ వేడి చూస్తే వేసవిని తలపిస్తోంది.

Update: 2026-08-12 04:12 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ దాకా సమయం ఉంది. కానీ ఏపీలో రాజకీయ వేడి చూస్తే వేసవిని తలపిస్తోంది. ఆ మాటకు వస్తే 2024 ఎన్నికలు జరిగిన తరువాత నుంచి కూడా ఎన్నికల వేడి అలాగే ఉంది కానీ ఎక్కడా తగ్గలేదు. అధికార కూటమి విపక్ష వైసీపీ ఢీ అంటే ఢీ కొడుతూ చేస్తున్న రాజకీయం మూలంగానే నిరంతరం రాజకీయం దూకుడుగానే సాగుతోంది. ఈ నేపధ్యంలో కొంత మంది ప్రముఖులు కూడా రాజకీయ ఆసక్తితో ముందుకు వస్తున్నారు. వారిలో మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతే కాదు ఏపీ రాజకీయాల మీద ఆయన డిబేట్లు పెడుతున్నారు. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ఇక చూస్తే తాజాగా ఆయన ఒక సంచలన ప్రకటన చేసారు.

ఫ్రంట్ ఏర్పాటుకు రెడీ :

తాజాగా ఏబీ వెంకటేశ్వరారావు వామపక్షాలు ప్రజా సంఘాలు మేధావులతో కూడిన ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో కొత్త ఫ్రంట్ గురించి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ అవసరం ఉందని ఆయన అన్నారు. అధికార కూటమి విపక్ష వైసీపీ రెండూ ఒక్కటే అని ఏబీవీ వ్యాఖ్యానించడం విశేషం. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు. అంతే కాదు తమదే సెకండ్ ఫ్రంట్ అవుతుందని కూడా ధీమాగా చెప్పారు.

ఆ దిశగానే అడుగులు :

అంతే కాదు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త వేదిక లేదా ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. అది ఎలా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఆయన ఇతర పార్టీల్లోని అసంతృప్తులు, మేధావులు, సామాజిక కార్యకర్తలను కలుపుకుని ఒక ప్రత్యామ్నాయ వేదికను తెస్తానని ఇటీవల పేర్కొంటున్నారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు ఫ్రంట్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి ఎలా ఉంటాయన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. అయితే దీని మీద కూడా సూత్రప్రాయంగా తెలుస్తున్న సమాచారం ఏమిటి అంటే రాష్ట్రంలో మేధావులు, సామాజిక ఉద్యమకారులు నిపుణులతో కూడిన ఒక నూతన ప్రజా వేదికను ఏర్పాటు చేయడం అన్నదే ఆయన ఉద్దేశ్యం గా కనిపిస్తోంది అని అంటున్నారు.

నూతన భావజాలంతో :

అలాగే కుల మతాలకు అతీతంగా సెక్యులర్ భావజాలంతో ఈ వేదిక పనిచేస్తుందని అంటున్నారు. ఇక రాజకీయాల్లో నైతికతను తీసుకురావడం వివిధ సమస్యల మీద అవస్థలు పడుతున్న వారికి పేదలకు, బాధితులకు అండగా నిలవడం ఫ్రంట్ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. అంతేఅ కాదు ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్నే కాదు గతంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలనలోని వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో గళం విప్పడం కూడా ఈ ఫ్రంట్ ఆలోచనలుగా చెబుతున్నారు. ఏపీలో కొత్త రాజకీయం అవసరం అని కూడా పదే పదే ఏబీ చెబుతున్నారు. ఏపీలో మత భావజాలం మెల్లగా విస్తరిస్తోంది అని దానిని అదుపు చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని తాజా సమావేశంలో ఏబీవీ చెప్పుకొచ్చారు. భావ స్వేచ్చకు అలాగే ప్రజాస్వామిక విలువలకు పట్టం కట్టే విధంగా రాజకీయం ఉండాలని ఆయన అంటున్నారు. మరి వివిధ పార్టీలతో ఏబీవీ ఏర్పాటు చేసే ఫ్రంట్ ఏపీ రాజకీయాల దశ దిశను మారుస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News