కౌశిక్ రెడ్డికి షాకిస్తున్న కాంగ్రెస్‌.. తెర‌వెనుక పాలిటిక్స్ ఇవే!

అసెంబ్లీ నియ‌మాల‌ను ఉల్లంఘించ‌డం.. స‌భా వేదిక‌గా స‌భ్యుల‌ను బెదిరించ‌డం వంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పాడికి.. అవే నియమాలు ఇప్పుడు ఉచ్చుగా మారే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని అంటున్నారు.

Update: 2026-09-26 15:30 GMT

తెలంగాణ రాజ‌కీయాలు మరింత హాట్ హాట్‌గా మారుతున్నాయి. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పంచ‌కు చేరిన దానం నాగేంద‌ర్‌పై కోర్టులు వేటు వేసిన నేప‌థ్యంలో దీనికి ప్ర‌తిగా ఇప్పుడు బీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, హుజూరాబాద్ నుంచి ఫ‌స్ట్‌టైమ్ విజ‌యం ద‌క్కించుకున్న పాడి కౌశిక్ రెడ్డికి చెక్ పెట్టేదిశ‌గా కాంగ్రెస్ పార్టీపావులు క‌దుపుతోంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ నియ‌మాల‌ను ఉల్లంఘించ‌డం.. స‌భా వేదిక‌గా స‌భ్యుల‌ను బెదిరించ‌డం వంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పాడికి.. అవే నియమాలు ఇప్పుడు ఉచ్చుగా మారే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో పాడి కౌశిక్‌రెడ్డిపై అసెంబ్లీ ద్వారానే అన‌ర్హ‌త వేటు వేయించే యోచ‌న‌లో కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు బ‌హిరంగ వ్యాఖ్య‌లే చేస్తున్నారు. ఇదే జ‌రిగితే.. ఖైర‌తాబాద్‌తో పాటు హుజూరాబాద్కు కూడా ఒకే సారి ఉప ఎన్నిక వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా అంటున్నారు. అయితే.. దీనిని కాంగ్రెస్ పార్టీ క‌క్ష‌పూరిత చ‌ర్య అని బీఆర్ ఎస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. కాదు.. స‌భ‌ను అగౌర‌వప‌రిచిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కాంగ్రెస్ చెబుతోంది. మొత్తంగా ఇప్పుడు పాడి చుట్టూ రాజ‌కీయం మ‌రోసారి రాజుకుంది.

ఏం చేశారు.?

ఈ ఏడాది బ‌డ్జెట్ స‌మావేశాల స‌మ‌యంలో పాడి కౌశిక్ రెడ్డి స‌భ‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా బీఆర్ ఎస్ నుంచి గెలిచి.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా మారిన మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న‌ను అడ్డుకోవ‌డంతోపాటు.. ''నువ్వు'' అని ఏక‌వ‌చ‌నంతో సంబోధించారు. అంతేకాదు.. దుర్భాష‌లాడార‌న్న‌ది కాంగ్రెస్ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌. అంతేకాదు.. త‌నను కాల్చేస్తాన‌ని కౌశిక్ రెడ్డి బెదిరించిన‌ట్టు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌డియం ఆరోపిస్తున్నారు. దీంతో వ్య‌వ‌హారం ముదిరిపోయి.. అసెంబ్లీ ఎథిక్స్ క‌మిటీకి ఈ విష‌యాన్ని రిఫ‌ర్ చేశారు.

ప్ర‌స్తుతం ఈ క‌మిటీ తీవ్రంగా శోధిస్తోంది. పాడిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, ఆయ‌న హావ‌భావాల‌ను వీడియోల రూపంలో కూడా ప‌రిశీల‌న చేస్తోంది. కాగా.. ఇంత‌లోనే దానం వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు పాడి విష‌యం మ‌రింత సీరియ‌స్ అయింది. ఎథిక్స్ క‌మిటీ తీసుకునే నిర్ణ‌యం అత్యంత ముఖ్యంగా మార‌డంతో పాడిపై వేటు వేయించ‌డ‌మో.. లేక రాజీనామాకు సిఫార‌సు చేయ‌డ‌మో ఖాయ‌మ‌ని అంటున్నారు ఎథిక్స్ క‌మిటీ అనేది రాజ్యాంగ బ‌ద్ధ‌మైన క‌మిటీ కావ‌డం, దీనికి స్పీక‌ర్ అనుమ‌తి ఉండ‌డంతో ఈ క‌మిటీ నిర్ణ‌యాన్నికోర్టుల్లో స‌వాల్ చేసేందుకు అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. పాడి అన‌ర్హుడు కావ‌డ‌మో.. రాజీనామా చేయ‌డ‌మో త‌ప్ప‌దు. దీంతో హుజూరాబాద్‌కు కూడా ఉప ఎన్నిక తీసుకురావాల‌న్న‌ది కాంగ్రెస్ ప్లాన్‌గా చెబుతున్నారు. దీనిని అడ్డుకునేందుకు బీఆర్ ఎస్ నాయ‌కులు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాగా.. త‌ను వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఆరు వారాలు గ‌డువు ఇవ్వాలంటూ..పాడి కోరి మూడు వారాలైంది. దీంతో మ‌రో రెండు వారాల్లోనే ఆయ‌న‌పై నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News